అదుర్స్ | rayal festivals at anantapur | Sakshi
Sakshi News home page

అదుర్స్

Published Thu, Aug 28 2014 3:53 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అదుర్స్ - Sakshi

అదుర్స్

 సాక్షి, అనంతపురం : విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బుధవారం పెనుకొండలోని వై జంక్షన్‌లో ఉన్న రాయల విగ్రహానికి మంత్రి పరిటాల సునీత, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు బీకే పార్థసారధి, బాలకృష్ణ, జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్ తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు కళాకారులు, విద్యార్థులు వివిధ వేషధారణలతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది.

అనంతరం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఆశీనులయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎమ్మెల్యే పార్థసారధిఅధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. శ్రీకృష్ణదేవరాయలు మంచి పరిపాలనాదక్షుడని కొనియాడారు. రాయల కాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందన్నారు. రాయలకు దూరదృష్టి ఎక్కువని, అందుకే భావితరాలకు ఉపయోగపడేలా చెరువులు తవ్వించడమే కాకుండా మొక్కలు నాటించారన్నారు.

అనంతరం రాష్ట్రాన్ని పాలించిన మన పాలకులు రాయలనాటి చెరువులను, వృక్షాలను సంరక్షించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. రాయల కాలంలో రతనాలు రాశులుగా పోసి అమ్మితే నేడు మనం కూరగాయలను కూడా రాశులుగా పోసి అమ్మలేకపోతున్నామంటే గత పాలకులు చేసిన అభివృద్ధి ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నైతిక విలువలు పెరగాలన్న లక్ష్యంతోనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో దేవాలయాలను విరివిగా నిర్మించారన్నారు. ఒక్క పెనుగొండలోనే 360 దేవాలయాలు ఉన్నాయంటే రాయల దైవచింతన ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు.

తెలుగుజాతి కీర్తిని చాటిచెప్పేందుకు ఈ ఉత్సవాలు ఉపయోగపడుతాయన్నారు. రాయల ఉత్సవాల తరహాలోనే త్వరలోనే లేపాక్షి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకు రూ.30 లక్షలు విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రాయలు చూపిన మార్గంలోనే సీఎం చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాలో చెరువుల నిర్మాణంతో పాటు చెక్ డ్యామ్‌లు, రాక్‌సిల్లుల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నీరు, చెట్టు కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2న జిల్లాలో 2 లక్షల మొక్కలను నాటనున్నట్లు చెప్పారు.
 
రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుదే
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మంత్రి పరిటాల సునీత తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి ప్రపంచ దేశాల్లో పరఢవిల్లాలంటే ఇలాంటి ఉత్సవాలు అవసరమన్నారు. కాంగ్రెస్ హయాంలో 3 సార్లు ఉత్సవాలు జరిపి ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. అయితే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. పెనుకొండ కోటపైకి వెళ్లాలంటే రోడ్డు మార్గం కూడా సరిగా లేదన్నారు. కోటను పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. అపరిశుభ్రతకు నిలయంగా మారిన గగన్‌మహల్‌ను సుందరంగా తీర్చిదిద్దిన ఘనత తన భర్త దివంగత పరిటాల రవీంద్రకే దక్కిందన్నారు.

అలాంటి పరిటాల రవీంద్ర నేడు ఈ ఉత్సవాలలో ఉండి ఉంటే తాను ఎంతో సంతోషించేదానినన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రూపు రేఖలు మార్చే లక్ష్యాన్ని భుజాలకెత్తుకుందన్నారు. రాష్ట్రాన్ని మరో సింగపూర్‌లా మార్చే శక్తి ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు. కరువు జిల్లా ప్రజల ఆకలిదప్పులు తీర్చేందుకు త్వరలోనే జిల్లాలో అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతపురం రైల్వేస్టేషన్, బస్టాండు, పెద్దాస్పత్రి వద్ద ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ప్రజలకు ఫ్లోరైడ్ రహిత నీటిని అందించేందుకు అక్టోబర్ 2 నుంచి ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా రూ.2కే మినరల్ వాటర్ అందించనున్నామన్నారు. రాయల పరిపాలనను తీసుకొచ్చే ఏకైక సీఎం చంద్ర బాబేనన్నారు. అక్టోబర్ 2 నుంచి వ ృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.1000, రూ.1500 పింఛన్ అందజేయనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడూ తన కుటుంబం కోసం ఆలోచించలేదని, సమాజమే తన కుటుంబంగా చూస్తారన్నారు. హంద్రీనీవాను త్వరలోనే పూర్తి చేసి జిల్లాలోని చెరువుల్లో నీళ్లు నింపుతామన్నారు. ఆడ పిల్లలందరికీ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకొస్తోందన్నారు.
 
దైవత్వం ఉందంటే రాయల గొప్పతనమే
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో దైవత్వం ఉందంటే అది రాయల గొప్పతనమేనని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్ణప్ప తెలిపారు. ఎన్ని యుగాలైనా జాతి ఆయన్ను మరవలేదన్నారు. సీజే పల్లె వద్ద రాయలు ఒకనాడు రోడ్డు దాటుతుండగా ఏనుగుల గుంపు అడ్డుగా రావడంతో రాయలు 2 గంటల పాటు నిలబడాల్సి వచ్చిందన్నారు. దీన్నిబట్టి చూస్తే నాడు అడవులు ఎంత దట్టంగా ఉన్నాయో అర్థమౌతుందన్నారు. ప్రస్తుతం అడవులు కనుమరుగవుతున్నాయన్నారు. విజయనగర పాలన స్వర్ణ యుగమని ఎమ్మెల్యే బీకే పార్థసారధి తెలిపారు. చంద్రబాబు సలహాలు, సూచనల వల్లే ఎన్‌టీఆర్ ఘన కీర్తి సాధించారని జెడ్పీ చైర్మన్ చమన్ తెలిపారు.  

తెలుగువాడిగా పుట్టినందుకు     గర్విస్తున్నా  
తెలుగువాడిగా పుట్టినందుకు ఎంతో గర్వకారణంగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక ృష్ణ తెలిపారు. రాయల ఉత్సవాలకు విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజలు ఇద్దరినే గుర్తు పెట్టుకున్నారన్నారు. అందులో ఒకరు శ్రీకృష్ణదేవరాయలు ఒకరైతే, మరొకరు దివంగత ఎన్‌టీఆర్ అని అన్నారు. అలాంటి మహానాయకుడి కొడుకుగా పుట్టినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు, నేను ఒక భక్తుడిని మాత్రమే అని చాటిచెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు అన్నారు.

సీఎం చంద్రబాబు కూడా భావితరాలకు ఉపయోగపడేలా నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విరివిగా చెరువులు తవ్వించడం, మొక్కలు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. హంద్రీ నీవాను ప్రారంభించింది ఎన్‌టీఆరేనని తెలిపారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు దాన్ని తుంగలో తొక్కారన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం హంద్రీ-నీవాను పూర్తి చేసే లక్ష్యాన్ని భుజానికెత్తుకుందన్నారు.

తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన గొప్ప నేత చంద్రబాబు అన్నారు. అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లనే వాడాలన్నారు. అనంతరం ఆదిత్య 369 సినిమాలోని డైలాగులతో ప్రజలను అలరింపజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్య రాజ్, శిల్పారామం స్పెషలాఫీసర్ జిఎన్‌రావు, జేసీ సత్యనారాయణ, ఎస్పీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement