
ఇడుపులపాయకు వైఎస్ జగన్
►స్వాగతం పలికిన జిల్లా నేతలు, అభిమానులు
►నేడు వైఎస్సార్ ఘాట్‌లో వర్ధంతి కార్యక్రమాలు
►నివాళులర్పించనున్న జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబసభ్యులు
►మధ్యాహ్నం పులివెందులలో ‘వైఎస్ కుటుంబం’ కార్యక్రమం ప్రారంభం
►రేపు క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ప్రతిపక్ష నేత
పులివెందుల/వేంపల్లె : వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయలో ఉన్న తన గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గాన ఇక్కడికి చేరుకున్నారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డి, షర్మిల, బ్రదర్ అనిల్‌కుమార్, రాజారెడ్డి, అంజలి, హర్ష, వర్షలు ఇడుపులపాయకు చేరుకున్నారు. శనివారం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని వారు ఇక్కడికి చేరుకున్నారు. శనివారం ఉదయం 7.30గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులర్పించనున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు.
వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, నాయకులు
ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం సాయంత్రం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కలిశారు. ఆయన ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, అంజద్‌బాషా, కడప నగర మేయర్ సురేష్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, పార్టీ కడప నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్ తదితరులు కలిసి మాట్లాడారు.
జిల్లా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు :
జిల్లాలోని ముస్లిం సోదరులకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ముస్లిం సోదరుడు ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
నేటి నుంచి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 8.00గంటలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం 10గంటలకు వేంపల్లెకు చేరుకొని స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 3గంటలకు పులివెందులలోని భాకరాపురంలో గల వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, ప్రజలకు అందుబాటులో ఉంటారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు.