'జీవితాంతం నటిస్తూనే ఉంటా'
► సొంత బ్యానర్‌పై సినిమాలు
► మదనపల్లె వాసులకు అవకాశం
► ప్రముఖ సినీ హాస్య నటుడు ఎల్బీ శ్రీరామ్
మదనపల్లె: ప్రేక్షకులు మెచ్చే విధంగా జీవితాంతం నటిస్తానని ప్రముఖ సినీ హాస్య నటుడు ఎల్బీ శ్రీరామ్ తెలిపారు. భరతముని ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మదనపల్లెలో ఆదివారం నిర్వహించిన మ్యాజిక్ ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 30 ఏళ్లుగా హాస్యాన్ని పండిస్తున్నానన్నారు. ఇటీవల సినిమాల ఆదరణ తగ్గి సీరియల్స్‌పై జనాలు మొగ్గుచూపుతున్నారన్నారు. తన సొంత బ్యానర్ లైఫ్ బ్యూటిఫుల్ క్రియేషన్ (ఎల్‌బీశ్రీరామ్) పై సినిమాలు నిర్మించి యూట్యూబ్‌లో విడుదలచేస్తానన్నారు. మంచి సినిమాలు తీయాలన్న ఆశయంతో మదనపల్లె పరిసర ప్రాంతాల్లో చిన్న సినిమాలను తీయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో మదనపల్లె పరిసర ప్రాంతాల్లో నటనపై ఆసక్తి కలిగిన వారికి అవకాశం కల్పిస్తానని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తనను సంప్రదిస్తే ప్రతిభను గుర్తించి సినిమాలో ఎంపిక చేస్తానన్నారు. తండ్రి, తాతలతో పాటు ప్రేక్షకులకు దగ్గరయ్యే ఎలాంటి పాత్రలైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆకట్టుకున్న మ్యాజిక్‌షో
బెంగళూరుకు చెందిన అమరేంద్రసాయి చైతన్యకుమార్(శ్రీవాత్సవ) చేసిన మ్యాజిక్ ప్రదర్శన చూపురులను ఆకట్టుకుంది. ఇతను ఐదో ఏట నుంచే మ్యాజిక్ ప్రదర్శనలు ఇస్తూ ఇప్పటి వరకు750 కిపైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపారు. విద్యతోపాటు మ్యాజిక్, స్టాంపులు,కాయిన్స్ కలక్షన్ చేస్తూ పలు ప్రదర్శనలు చేసి మన్ననలు అందుకున్నారు. అనంతరం ఎల్.బి.శ్రీరామ్,శ్రీవాత్సవలను ఘనంగా శాలువాలతో సత్కరించారు.