బెర్తు దక్కేదెవరికి? | tomorrow ap cabinet resheduled | Sakshi
Sakshi News home page

బెర్తు దక్కేదెవరికి?

Published Fri, Mar 31 2017 11:59 PM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM

బెర్తు దక్కేదెవరికి? - Sakshi

బెర్తు దక్కేదెవరికి?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు (ఆదివారం) ఉదయం 9.25 గంటలకు మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

- రేపే మంత్రివర్గ విస్తరణ
–  బెర్త్‌ కోసం ఎవరికి వారు తీవ్ర యత్నాలు
– మైనార్టీ కోటాలో చోటు కోసం చంద్రబాబు, లోకేశ్‌ను కలిసిన చాంద్‌బాషా
– ఎలాగైనా చోటు దక్కించుకోవాలని కేశవ్‌ విశ్వప్రయత్నాలు
– బీసీ కోటాలో ఆశలు పెట్టుకున్న బీకే, కాలవ
- నేటి సాయంత్రం ప్రకటన వెలువడే అవకాశం
–  తనను కొనసాగించాలని లోకేశ్‌కు మంత్రి ‘పల్లె’ వినతి


సాక్షిప్రతినిధి, అనంతపురం : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు (ఆదివారం) ఉదయం 9.25 గంటలకు మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మొదట ఉగాది రోజున విస్తరణ చేపట్టాలని భావించినప్పటికీ లోకేశ్‌ జాతకరీత్యా ఆరోజు అంత మంచిగా లేదని జ్యోతిష్య పండితులు చెప్పడంతో ఏప్రిల్‌ రెండుకు ముహూర్తాన్ని వాయిదా వేశారు. విస్తరణ ఖరారు కావడంతో ‘అనంత’ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. కేబినెట్‌లో చోటు ఆశిస్తున్న వారితో పాటు ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లోనూ టెన్షన్‌ నెలకొంది. జిల్లాలోని ఇద్దరు మంత్రుల్లో ఒకరిపై వేటు పడుతుందా? లేక ఇద్దరినీ తొలగిస్తారా? కొత్తగా ఇద్దరికి చోటు కల్పిస్తారా?..ఇలా పలువిధాలుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఎవరికి వారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీలో ‘నయా పవర్‌సెంటర్‌’గా ఉన్న లోకేశ్‌ను కూడా కలుస్తున్నారు.

            జిల్లాలో ప్రస్తుతం నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కేబినెట్‌ హోదాలో కొనసాగుతున్నారు. వీరిలో పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత మంత్రులుగా ఉండగా,  కాలవ శ్రీనివాసులు ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా, యామినీబాల విప్‌గా ఉన్నారు. అయితే.. విస్తరణలో పల్లెపై వేటు పడుతుందనే చర్చ నడుస్తోంది. ఈయన శాఖల్లోని మైనార్టీ శాఖను అదే వర్గానికి ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీలో మైనార్టీలెవరూ ఎమ్మెల్యేగా గెలవలేదు. ఆ పార్టీలోకి అరువొచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, చాంద్‌బాషాలు వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచినవారు. వీరు కాకుండా ఎమ్మెల్సీ షరీఫ్‌ ఉన్నారు.

ఈ ముగ్గురిలో జలీల్‌ఖాన్‌ ‘బీకాం ఫిజిక్స్‌లో ఫెయిల్‌’ అయ్యారు. దీంతో ఈయన కేబినెట్‌ ఆశలకు గండిపడినట్లే! మిగిలిన ఏకైక ఎమ్మెల్యే చాంద్‌బాషా. రాయలసీమను ప్రాతిపదికగా తీసుకుంటే మైనార్టీల ప్రభావం అధికంగా ఉండే ప్రాంతం కావడంతో ఈ సమీకరణ నేపథ్యంలో తనకు కేబినెట్‌లో చోటు కల్పించాలని చాంద్‌బాషా.. చంద్రబాబుతో పాటు లోకేశ్‌ను శుక్రవారం కలిసి కోరారు. ‘చూద్దాం’ అనే మాట మినహా స్పష్టమైన హామీ  దక్కలేదు.

ఇద్దరిలో ఉండేదెవరు? ఊడేదెవరు?
        ప్రస్తుతమున్న ఇద్దరు మంత్రుల్లో పల్లె రఘునాథరెడ్డికి ఉద్వాసన తప్పదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు నుంచి భూమా అఖిల ప్రియ, వైఎస్సార్‌ జిల్లా నుంచి ఆదినారాయణరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు నుంచి పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పల్లెకు ఉద్వాసన తప్పదని సమాచారం. ఇదే క్రమంలో పరిటాల సునీత పనితీరుపైనా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే..ఆమెను తప్పించడంపై కాస్త డోలాయమానంలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో ఇద్దరినీ తప్పించబోరని, మూడో మంత్రి పదవి దక్కొచ్చని కూడా కొందరు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న పదవులను బట్టి చూస్తే ఇది కష్టసాధ్యమే!

బీసీ కోటాలో బీకే, కాలవ ఆశలు
        ప్రస్తుతమున్న ఇద్దరు మంత్రులు ఓసీ సామాజికవర్గానికి చెందినవారు. ‘అనంత’లో బీసీల ప్రాబల్యం అధికం. దీంతో వారికి సముచిత స్థానం కల్పించాలని మొదటి నుంచి చంద్రబాబును ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న తనకు కేబినెట్‌లో చోటు దక్కుతుందనే ఆశతో పెనుకొండ ఎమ్మెల్యే బీకే  పార్థసారథి ఉన్నారు. ఈయనకు కాలవ శ్రీనివాసులు రూపంలో గట్టి పోటీ నెలకొంది.

అయితే.. తాను చీఫ్‌విప్‌గా ఉన్నానని, కేబినెట్‌లో  చోటు ఆశించడం లేదని కాలవ బాహాటంగానే వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనికి కారణం రాయదుర్గంలో కాలవకు వ్యతిరేకవర్గం బలంగా తయారవుతుండడమే. కేబినెట్‌పై కీలక నేతలు ఆశలు పెట్టుకున్న తరుణంలో తాను పోటీగా మారితే వ్యతిరేకత మరింత పెరుగుతుందని, ఇది వచ్చే ఎన్నికల్లో తన మనుగడనే ప్రశ్నార్థకం చేసే పరిస్థితికి దారితీస్తుందనే ముందస్తు జాగ్రత్తకు కాలవ వచ్చినట్లు తెలుస్తోంది.

కేశవ్‌ విశ్వప్రయత్నాలు
            కేబినెట్‌ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్నవారిలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ ప్రముఖంగా ఉన్నారు. కీలక సమయంలో ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో తనకు కేబినెట్‌లో చోటు దక్కలేదని తీవ్ర ఆవేదనతో  ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండటంతో ఎలాగైనా మంత్రివర్గంలో చేరాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయం కావడంతో అదే సామాజికవర్గానికి చెందిన కేశవ్‌ను పక్కనపెడతారనే చర్చ నడుస్తోంది. పైగా పరిటాల సునీత ప్రస్తుత కేబినెట్‌లో ఉండటం ఆయనకు ప్రతికూలాంశం. అయితే.. ఇద్దరు మంత్రుల పనితీరూ ఆశించినస్థాయిలో లేదని, ఎన్నికలకు దూకుడుగా ఉన్న మంత్రులతో వెళ్లాలని సీఎం భావిస్తుండటంతో ఎలాగైనా తనకు చోటు కల్పిస్తారనే ఆశతో కేశవ్‌ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement