సమగ్ర అభివృద్ధికి కృషి | total development target | Sakshi
Sakshi News home page

సమగ్ర అభివృద్ధికి కృషి

Published Mon, Aug 15 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

సమగ్ర అభివృద్ధికి కృషి

సమగ్ర అభివృద్ధికి కృషి

సంక్షేమ కార్యక్రమాలతో ముందడుగు
స్వాతంత్య్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప 
 
కాకినాడ సిటీ:
దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు, సత్వర రాష్ట్రాభివృద్ధికి ప్రజలంతా సమష్టిగా పునరంకితం అవుదామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పోలీస్‌ పేరేడ్‌ మైదానంలో 70వ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్, ఎన్‌సీసీ దళాలు నిర్వహించిన గౌరవ వందనాన్ని స్వీకరించి మార్చ్‌ఫాస్ట్‌ను తిలకించారు. అనంతరం జిల్లా  ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను అందించిన మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. 
రెండంకెల రేటు అభివృద్ధి సాధన లక్ష్యంగా...
  జిల్లాలో ఈ సంవత్సరం రైతులకు రూ.6,800 కోట్లు పంట రుణాలుగా అందిస్తున్నామని, రెండంకెల రేటు అభివృద్ధి సాధన లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు పలు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామన్నారు. ఉద్యానవన రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వర్తింపచేసిన రుణమాఫీ పథకం కింద జిల్లాలో 2,228 మంది రైతులకు రూ.38.75 కోట్లు లబ్ధి చేకూర్చామన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఈ ఏడాది రూ.1,346 కోట్లు రుణాలు మహిళా గ్రూపులకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్‌టీఆర్‌ భరోసా పథకం ద్వారా జిల్లాలో 4,74,975 మంది పేదలకు ప్రతి నెలా రూ.51 కోట్ల మొత్తాన్ని సామాజిక భద్రతా పింఛన్లుగా అందిస్తున్నామన్నారు.
రూ.473 కోట్ల వ్యయంతో  21 వేల గృహాలు...
   ఎన్‌టీఆర్‌ గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.473 కోట్ల వ్యయంతో  21 వేల గృహాలు బడుగు వర్గాల కోసం నిర్మాణం చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.237 కోట్ల వ్యయంతో 3 లక్షల 40 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించి, గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, పంట కుంటలు, పేదల భూముల్లో ఎన్‌టీఆర్‌ జలసిరి బోర్లు వంటి ఆస్తుల అభివృద్ధి చేశామన్నారు. జిల్లాలో 15,30,370 పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించామని, లక్షా 82వేల పేద కుటుంబాలకు దీపం వంట గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో మాతా శిశు సంజీవిని ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, అన్న దీవెన తదితర కార్యక్రమాలతో మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 
   వివిధ సామాజక వర్గాల సంక్షేమం కోసం ఈ ఏడాది చేట్టిన కార్యాచరణలో భాగంగా ఈ సంవత్సరం కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.150 కోట్ల సబ్సిడీతో 15వేల మంది లబ్ధిదారులకు రూ.300 కోట్ల విలువైన యూనిట్లు అందిస్తున్నామన్నారు. ప్రజలందరి సహకారంతో జిల్లా ప్రగతి పధంలో మరింత ముందుకు సాగాలని మంత్రి తన ప్రసంగంలో ఆకాంక్షిచారు. వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుడు చోడిపల్లి హనుమంతరావును మంత్రి సత్కరించారు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన జిల్లా గిరిజన సాహస యువకుడు దూబి భద్రయ్యను మంత్రి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. 
వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు సహాయల పంపిణీ...
  వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖలు పథకాల సమాచారం, ఎగ్జిబిట్‌లతో స్టాళ్ళను ఏర్పాటు చేశాయి. వివిధ శాఖల ద్వారా మంజూరు చేసిన వస్తుసముదాయాన్ని లబ్ధిదారులకు  మంత్రి పంపిణీ చేశారు. ఇందులో భాగంగా డీఆర్‌డీఏ ద్వారా 1680 గ్రూపులకు రూ.75.60 కోట్ల బ్యాంకు రుణాల లింకేజీ, 1691 మంది మహిళలకు రూ. 20 కోట్ల 11 లక్షలు స్త్రీనిధి రుణాలు, మెప్మా ద్వారా 1112 గ్రూపులకు రూ.50 కోట్ల 3లక్షలు బ్యాంకు రుణాల లింకేజీని లబ్ధిదారులకు అందించారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.31 లక్షలు విలువైన 18 యూనిట్లు, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.35 లక్షల 50వేల విలువైన 23 యూనిట్లు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ద్వారా రూ.12లక్షల 11వేలు విలువైన 248 యూనిట్లు పంపిణీ చేశారు. Sవ్యవసాయ శాఖ ద్వారా రూ.175 కోట్ల మేరకు రుణమాఫీ ప్రయోజనాల పత్రాలను లబ్ధిదార రైతులకు జారీ చేశారు.
   ఈ కార్యక్రమంలో మంత్రి చినరాజప్ప సతీమణి అనూరాధ, కలెక్టర్‌ అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్‌పీ రవిప్రకాష్, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌–2 జె.రాధాకృష్ణమూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement