సాక్షి,యాదాద్రి : యాదాద్రి పరిసరాల్లోని పర్యాటక, పుణ్య క్షేత్రాలను కలుపుకుని యాదాద్రి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల సీఎం కేసీఆర్ వైటీడీఏ అధికారులతో కలిసి నిర్వహించిన యాదాద్రి సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా టూరిజం, దేవాదాయ, పురావస్తు శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
యాదాద్రి నవగిరులను ఆధ్యాత్మిక దర్శనీయ ప్రార్థన మందిరాలుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ఇప్పటికే మొదయ్యాయి. తాజాగా యాదగిరిగుట్టకు 12 కిలోమీటర్ల దూరంలోని భువనగిరి ఖిలాను, 23 కిలోమీటర్ల దూరంలోని కొలనుపాకను వైటీడీఏ కిందికి చేర్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాలను పరిశీలించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు మరో మాస్టర్‌ప్లాన్ రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
హైదారాబాద్‌కు చేరువలో..
భువనగిరి ఖిలా, యాదగిరిగుట్ట, కొలనుపాక పక్కపక్కనే ఉండడంతో దేశ విదేశాల పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్, వరంగల్ వైపు నుంచి వచ్చే పర్యాటకులు, భక్తులు ఈ మూడు ప్రాంతాలకు వచ్చిపోతుంటారు. భువనగిరి ఖిలా హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యాటకుల కోసం ఇక్కడ పర్యాటక, పురావస్తుశాఖ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు యాదగిరిగుట్టకు వెళ్లడానికి బస్, ఆటో, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
యాదగిరీశుడిని దర్శించుకున్న అనంతరం ఆలేరు మండలంలోని కొలనుపాకకు చేరుకుంటారు. అక్కడ పురావస్తు శాఖ మ్యూజియంతో పాటు, వీరశైవ మతానికి చెందిన చండికాంబ సహిత సోమేశ్వరాలయం, జైన దేవాలయం ఉన్నాయి. దీంతో యాదగిరిగుట్ట, భువనగిరి, కొలనుపాకను వైటీడీఏ గొడుగుకిందికి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాంతాల్లో పరిపాలన పరంగా ఒకే రకమైన చర్యలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టే అవకాశాలున్నాయి.
యాదాద్రి టూరిజం సర్క్యూట్‌కు
సీఎం ఆదేశం
జిల్లాలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు, టూరిజం సర్క్యూట్‌కు కావాల్సిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌కు టూరిజం సర్క్యూట్ ప్రణాళికలు సమర్పిస్తాం.
– అనితారామచంద్రన్, కలెక్టర్
యాదాద్రి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు
Published Thu, Feb 16 2017 1:00 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
Advertisement
Advertisement