జిల్లాలో ట్రాఫిక్‌ పార్కులు | TRAFFIC PARKS IN TOWNS | Sakshi
Sakshi News home page

జిల్లాలో ట్రాఫిక్‌ పార్కులు

Published Mon, Mar 6 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

TRAFFIC PARKS IN TOWNS

తణుకు: ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన పెంచడంతోపాటు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలో ట్రాఫిక్‌ పార్కుల నిర్మాణం చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మున్సిపాలిటీకి ఒకటి చొప్పున నిర్మించాలని రవాణాశాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా ప్రధాన కేంద్రంలోని ఏలూరు జిల్లా ఉపరవాణా కమిషనర్‌ కార్యాలయం పరిధిలో ఇప్పటికే డ్రైవింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయగా తాజాగా భీమవరం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం పరిధిలోని ప్రైవేట్‌ స్థలంలో డ్రైవింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుచేశారు. ఇదిలా ఉంటే తణుకు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం రవాణా శాఖ యూనిట్‌ కార్యాలయాల పరిధిలో ట్రాఫిక్‌ పార్కుల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో స్థల సేకరణకు ఇబ్బందులు తలెత్తడంతో మున్సిపల్‌ రిజర్వ్‌ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 
వాహన పరీక్షలు ఏవీ..?
జిల్లాలోని వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడానికి ఆయా రవాణాశాఖ కా ర్యాలయాల్లో పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ఇం దులో ప్రాథమికంగా తీసుకునే ఎల్‌ఎల్‌ఆర్‌కు కంప్యూటర్‌లో పరీక్ష ఉత్తీర్ణత పొందాలి. కంప్యూటర్‌లో వచ్చే 20 ప్రశ్నల్లో 12 సరైన సమాధానాలు ఇవ్వ డం ద్వారా వాహనదారుడు ఉత్తీర్ణత చెం దినట్టు భావించి ఎల్‌ఎల్‌ఆర్‌ అందజేస్తారు. 30 రోజుల అనంతరం తీసుకునే శాశ్వత డ్రైవింగ్‌ లైసె¯Œ్స పొందడానికి సంబంధిత వాహనం నడపాల్సి ఉం టుంది. ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్‌ ట్రాక్‌ల్లో వాహనం నడిపిన తర్వాత వాహనదారుడికి లైసెన్స్‌ మంజూరు చేయాలా లేదా అనేది మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే ఏలూరు, భీమవరం మినహా మిగిలిన ప్రాంతాల్లో డ్రైవింగ్‌ ట్రాక్‌లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న రోడ్డుపైనే పరీక్షించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వాహనదారులు పలు సందర్భాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతోపాటు ట్రాఫిక్‌ నిబంధనలు, సూచికలు లేకపోవడంతో ట్రాఫిక్‌పై అవగాహన రావడంలేదు. దీంతో డ్రైవింగ్‌ లైసెన్సులు పొందుతున్నా క్షేత్రస్థాయిలో అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని గమనించిన అధికారులు జిల్లాలోని మున్సిపల్‌ కేంద్రాల్లో ట్రాఫిక్‌ పార్కుల పేరుతో డ్రైవింగ్‌ ట్రాక్‌లు నిర్మించాలనే ప్రతిపాదనను తీసుకువచ్చారు. 
 
స్థల సేకరణే సవాల్‌
ట్రాఫిక్‌ పార్కుల నిర్మాణం పేరుతో చేపట్టబోయే డ్రైవింగ్‌ ట్రాక్‌ల నిర్మాణానికి స్థల సేకరణ అంశం ప్రతిబంధకంగా మారుతోంది. ఒక్కో ట్రాక్‌ నిర్మాణానికి ఎకరా నుంచి రెండెకరాల స్థలం అవసరముంటుంది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఎకరా రూ.కోటి వరకు పలుకుతుండటంతో డ్రైవింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపల్‌ కేంద్రాల్లో రిజర్వు స్థలాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 
 
అద్దె భవనాల్లో కార్యాలయాలు
జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం యూనిట్‌ రవాణాశాఖ  కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డ్రైవింగ్‌ ట్రాక్‌లు ఉన్న ప్రాంతాల్లోనే కార్యాలయాలు ఉండాల్సిన పరిస్థితి. రిజర్వు స్థలాల్లో కార్యాలయాల నిర్మాణం సాధ్యం కాకపోవడంపై రవాణాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. డ్రైవింగ్‌ ట్రాక్‌లు ఒకచోట, కార్యాలయాలు మరోచోట ఉంటే ఫలితం ఉండదని వారంటున్నారు. ఆర్టీసీ డిపో స్థలాల్లో డ్రైవింగ్‌ ట్రాక్‌లు నిర్మించాలని గతంలో చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం మున్సిపాలిటీల పరిధిలోని ట్రాఫిక్‌ పార్కుల పేరుతో నిర్మాణం చేపట్టనున్న డ్రైవింగ్‌ ట్రాక్‌ పట్టాలెక్కుతుందో లేదో వేచి చూడాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement