♦ ట్రాఫిక్ మళ్లింపుతో వాహనదారుల కష్టాలు
♦ గంటల తరబడి నిలిచిన రాకపోకలు
♦ రోడ్లపైన ప్రయాణికుల పడిగాపులు
♦ ముందస్తు సమాచారం లేక ఇబ్బందులు
నిజామాబాద్ సిటీ: నగరంలోని కంఠేశ్వర్ రైల్వే కమాన్ వద్ద జరుగుతున్న పనులతో ప్రయాణికులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ముందస్తు సమాచారం లేకుండా ట్రాఫిక్ పోలీసులు రాకపోకలను నియంత్రించడంతో వాహనదారులు శుక్రవారం నరక యాతన అనుభవించారు. ట్రాఫిక్ మళ్లింపుతో నగరంలో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న రైల్వే బ్రిడ్జి పక్కనే పెద్దపల్లి-నిజామాబాద్ నూతన రైల్వే లైన్ కోసం వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే రెండు పిల్లర్లు నిర్మించే సమయంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. పిల్లర్లు పూర్తి కావడంతో ఆంక్షలు ఎత్తివేశారు.
పిల్లర్లపై వంతెన నిర్మించే పనులు మొదలు కావడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కంఠేశ్వర్ నుంచి ఎన్‌టీఆర్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలు ఎంఎస్‌ఆర్ స్కూల్, పూలాంగ్‌వాగుపై గల రైల్వే బ్రిడ్జి కింద నుంచి ఎల్లమ్మగుట్ట మీదుగా మళ్లించారు. ఈ మార్గంలో కార్లు, ఆటోలు, బైక్‌లను మాత్రమే అనుమతించారు. బస్సులు, లారీల వంటి వాటిని పాలిటెక్నిక్ కాలేజీ, జెడ్పీ, హమల్‌వాడి, నాందేవ్‌వాడ, రైల్వే ఓవర్ బ్రిడ్జిపై నుంచి బస్టాండ్, రైల్వేస్టేషన్, ఎన్‌టీఆర్ చౌరస్తా వైపు మళ్లించారు. ఎన్‌టీఆర్ చౌరస్తా నుంచి కంఠేశ్వర్ వైపునకు వెళ్లే వాహనాలను ఇదే మార్గంలో అనుమతించారు.
దీంతో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఎన్‌టీఆర్ చౌరస్తా నుంచి కంఠేశ్వర్ వైపు వెళ్లేందుకు ఆటోలు, బైక్‌లను పూలాంగ్‌వాగు బ్రిడ్జి కింద నుంచి అనుమతిస్తే బాగుంటుందని వాహనదారులు కోరుతున్నారు. అలాగే, ట్రాఫిక్ జామ్ కాకుండా సిబ్బందిని నియమించాలని సూచిస్తున్నారు. వంతెన నిర్మాణం పనులు పూర్తి కావాలంటే కనీసం 20 రోజులు పడుతుందని, అప్పటివరకు ఈ సమస్య తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.