పండ్లతోటల రైతులతో ట్రైనీ కలెక్టర్ ముఖాముఖి
– మన్నీల, బత్తలపల్లి, రెడ్డిపల్లిలో తోటల పరిశీలన
అనంతపురం అగ్రికల్చర్ : పండ్లతోటల రైతుల స్థితిగతులపై ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ అధికారులతో కలిసి మంగళవారం రూరల్ మండలం మన్నీల, బత్తలపల్లి, బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలో పర్యటించారు. దానిమ్మ, అరటి, ద్రాక్ష తోటలను సందర్శించి వాటి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు. పంట పెట్టుబడులు, దిగుబడులు, మార్కెటింగ్, ఇతరత్రా సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాలు, రాయితీలను తెలుసుకున్నారు. పంటల యాజమాన్యం, పురుగులు, తెగుళ్ల గురించి ఆరా తీశారు. ఇపుడున్న పరిస్థితుల్లో ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు.
అయితే అధికారులు, శాస్త్రవేత్తల సిఫారసులు, సీజన్ల వారీగా మార్కెటింగ్ ఆధారంగా ముందుకు పోవాలన్నారు. తద్వారా ఆర్థికాదాయం సాధించవచ్చన్నారు. దీని వల్ల ప్రభుత్వం లక్ష్యం రెండంకెల వృద్ధి రేటు కూడా సాధ్యమవుతుందన్నారు. రేకులకుంట వ్యవసాయ, ఉద్యాన పరిశోధనా స్థానాల్లో జరుగుతున్న పరిశోధనలు, వాటి ఫలితాలు, ప్రయోగాత్మక కార్యక్రమాలపై తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ఏడీలు సత్యనారాయణ, బీవీ రమణ, టెక్నికల్ హెచ్‌వో జి.చంద్రశేఖర్, శాస్త్రవేత్తలు రవీంద్రారెడ్డి, సహదేవరెడ్డి, రాధిక, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.