పండ్లతోట రైతులకు చేయూత
– కోరమాండల్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్
అనంతపురం అగ్రికల్చర్ : మేము సైతం అంటూ... అరటి, దానిమ్మ, టమాట రైతులకు సాయం చేస్తామని కోరమాండల్ కంపెనీ అధికారులు ముందుకొచ్చారు. అరటి, దానిమ్మను ప్రోత్సహిస్తామంటూ శుక్రవారం ముంబైకి చెందిన ఐఎన్‌ఐ ఫార్మ్ ప్రతినిధులు ప్రకటంచిన మరుసటి రోజు శనివారం కోరమాండల్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ ఉద్యానశాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ఏడీ సీహెచ్ సత్యనారాయణ, టెక్నికల్ హెచ్‌వో జి.చంద్రశేఖర్ తదితరులు కోరమాండల్ ప్రతినిధి శ్రీనివాస్‌కు పంటలు, రైతుల గురించి తెలియజేశారు.
నాణ్యమైన సుస్థిరమైన పంట దిగుబడులు సాధించడానికి రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తామన్నారు. అలాగే మట్టి, నీరు, పత్ర విశ్లేషణల ద్వారా పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, ప్రధానంగా డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ అంశాలపై రైతుల్లో అవగాహన కల్పించి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 28న పైన తెలిపిన మూడు పంటలకు సంబంధించి పెద్ద ఎత్తున రైతు సదస్సు నిర్వహిస్తామన్నారు.