Horticulture farmers
-
పండ్లతోటల రైతులతో ట్రైనీ కలెక్టర్ ముఖాముఖి
– మన్నీల, బత్తలపల్లి, రెడ్డిపల్లిలో తోటల పరిశీలన అనంతపురం అగ్రికల్చర్ : పండ్లతోటల రైతుల స్థితిగతులపై ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ అధికారులతో కలిసి మంగళవారం రూరల్ మండలం మన్నీల, బత్తలపల్లి, బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలో పర్యటించారు. దానిమ్మ, అరటి, ద్రాక్ష తోటలను సందర్శించి వాటి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు. పంట పెట్టుబడులు, దిగుబడులు, మార్కెటింగ్, ఇతరత్రా సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాలు, రాయితీలను తెలుసుకున్నారు. పంటల యాజమాన్యం, పురుగులు, తెగుళ్ల గురించి ఆరా తీశారు. ఇపుడున్న పరిస్థితుల్లో ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. అయితే అధికారులు, శాస్త్రవేత్తల సిఫారసులు, సీజన్ల వారీగా మార్కెటింగ్ ఆధారంగా ముందుకు పోవాలన్నారు. తద్వారా ఆర్థికాదాయం సాధించవచ్చన్నారు. దీని వల్ల ప్రభుత్వం లక్ష్యం రెండంకెల వృద్ధి రేటు కూడా సాధ్యమవుతుందన్నారు. రేకులకుంట వ్యవసాయ, ఉద్యాన పరిశోధనా స్థానాల్లో జరుగుతున్న పరిశోధనలు, వాటి ఫలితాలు, ప్రయోగాత్మక కార్యక్రమాలపై తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ఏడీలు సత్యనారాయణ, బీవీ రమణ, టెక్నికల్ హెచ్‌వో జి.చంద్రశేఖర్, శాస్త్రవేత్తలు రవీంద్రారెడ్డి, సహదేవరెడ్డి, రాధిక, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
పండ్లతోట రైతులకు చేయూత
– కోరమాండల్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ అనంతపురం అగ్రికల్చర్ : మేము సైతం అంటూ... అరటి, దానిమ్మ, టమాట రైతులకు సాయం చేస్తామని కోరమాండల్ కంపెనీ అధికారులు ముందుకొచ్చారు. అరటి, దానిమ్మను ప్రోత్సహిస్తామంటూ శుక్రవారం ముంబైకి చెందిన ఐఎన్ఐ ఫార్మ్ ప్రతినిధులు ప్రకటంచిన మరుసటి రోజు శనివారం కోరమాండల్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ ఉద్యానశాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ఏడీ సీహెచ్ సత్యనారాయణ, టెక్నికల్ హెచ్‌వో జి.చంద్రశేఖర్ తదితరులు కోరమాండల్ ప్రతినిధి శ్రీనివాస్‌కు పంటలు, రైతుల గురించి తెలియజేశారు. నాణ్యమైన సుస్థిరమైన పంట దిగుబడులు సాధించడానికి రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తామన్నారు. అలాగే మట్టి, నీరు, పత్ర విశ్లేషణల ద్వారా పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, ప్రధానంగా డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ అంశాలపై రైతుల్లో అవగాహన కల్పించి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 28న పైన తెలిపిన మూడు పంటలకు సంబంధించి పెద్ద ఎత్తున రైతు సదస్సు నిర్వహిస్తామన్నారు. -
ఉద్యానం... అధ్వానం
– సేవలు అందించని ఉద్యానవన శిక్షణా కేంద్రం – ఓ అధికారి సెలవులో వెళ్లడమే కారణం – తీవ్ర ఇబ్బందుల్లో పండ్లతోటల రైతులు అనంతపురం అగ్రికల్చర్ : ఈ ఏడాది ఉద్యానశాఖకు రూ.50 కోట్లు బడ్జెట్ కేటాయించారు. స్టేట్‌ప్లాన్, ఎంఐడీహెచ్, ఆర్కేవీవై కింద వివిధ రకాల పథకాలను మండలాలు, డివిజన్ల వారీగా లక్ష్యాలు పెట్టుకున్నా అవి అనుకున్న విధంగా అమలు కావడం లేదు. ఓ వైపు పథకాలు నత్తనడకన కొనసాగుతుండగా మరో వైపు రైతులకు కొంతవరకు మేలు చేసే ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రం కార్యకలాపాలకు పూర్తీగా స్వస్తిపలికారు. నెలన్నర రోజులుగా ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించకపోవడంతో సరైన యాజమాన్య పద్ధతులు, ఇతరత్రా సాంకేతిక సలహాలు అందక పండ్లతోటల రైతులకు కష్టాలు తప్పడం లేదు. ప్రిన్సిపల్ చంద్రశేఖర్‌గుప్తా నెల రోజులుగా సెలవులో ఉండటంతో శిక్షణా కేంద్రాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నెలకు ఐదు చొప్పున సంవత్సరానికి 60 శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించిన ఉద్యానశాఖ వాటిని అర్ధాంతరంగా ఆపేసింది. జిల్లా శాస్త్రవేత్తలతో పాటు తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చే శాస్త్రవేత్తలు ఇస్తున్న సూచనలు, సాంకేతిక సలహాలు ఉద్యాన రైతులకు కొంత వరకు వెసులుబాటు ఉండేది. పండ్లు, పూల, ఔషధమొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా సూక్ష్మసాగు తదితర ఉద్యాన పంటలు 1.70 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో సాగులో ఉండటంతో సీజన్ వారీగా పాటించాల్సిన సరైన సస్యరక్షణ, పోషక, సమగ్ర యాజమాన్య పద్ధతులు, సాంకేతిక సలహాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. శిక్షణా కార్యక్రమాలు నిలిచిపోవడంతో టెక్నికల్ హెచ్ఓ జి.చంద్రశేఖర్‌పైనే ఎక్కువ భారం పడుతోంది. కార్యాలయ విధులు, నివేదికల తయారీ, రైతులకు సాంకేతిక సలహాలు, సస్యరక్షణ సిఫారసులు, క్షేత్రస్థాయి పర్యటనలు తదితర వాటితో చంద్రశేఖర్ ఇబ్బంది పడుతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా శిక్షణా కేంద్రం ద్వారా కార్యక్రమాలు యథావిధిగా సాగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఉద్యాన రైతులకు అవార్డుల పంట
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యానవన పంటల్లో రాణిస్తున్న రైతులు, అధికారులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం అవార్డులు అందించారు. విజయవాడ ఆంధ్రాలయోల కళాశాల ప్రాంగణంలో ఉద్యానశాఖ, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రథమ ఉద్యాన, మామిడి మేళా-2016లో ఈ అవార్డులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా అందించారు. ఉద్యాన పంటల విభాగం: చామంతిసాగులో సీహెచ్ లీలాప్రసాద్(విజయనగరం జిల్లా), బంతి సాగులో తూకూరి గైరమ్మ (విశాఖ జిల్లా), అరటిసాగులో చాట్ల సత్యనారాయణ రాజు (విశాఖ జిల్లా), మామిడి సాగులో చీర్ల నరసింహారావు (తూర్పుగోదావరి), హోతా వీరభద్రరావు (పశ్చిమగోదావరి), ఎస్.జనార్దన రెడ్డి(వైఎస్సార్ కడప), నిమ్మసాగులో మోటూరి శ్రీనివాసరావు(కృష్ణాజిల్లా), టమాట, క్యాప్సికమ్ సాగులో యనమదల సత్యనారాయణ (గుంటూరు జిల్లా), టి.సరస్వతి (కర్నూలు), మామిడి, కూరగాయలు, పూలు సాగులో కాట్రగడ్డ సుబ్బారావు (ప్రకాశం), బత్తాయి సాగులో దేవరపల్లి వెంకట ఈశ్వర్‌దత్తు(నెల్లూరు), దానిమ్మ పంటకు కె.చంద్రశేఖర్ (అనంతపురం), బొప్పాయి, కూరగాయలు పంటలకు సి.అశోక్ కుమార్(చిత్తూరు)లు సత్కారాలు, అవార్డులు అందుకున్నారు. సూక్ష్మ నీటిపారుదల (డ్రిప్ ఇరిగేషన్) విభాగంలో : ఉద్యన పంటల సాగులో సూక్ష్మ నీటిపారుదల విభాగంలో పలువురు రైతులకు అవార్డులు అందించారు. కొరికిన రవికుమార్(శ్రీకాకుళం జిల్లా), బి.కొండబాబు (విజయనగరం జిలా), కొల్లి సురేష్ (విశాఖ జిల్లా), డి.సత్యనారాయణరాజు (తూర్పుగోదావరి జిల్లా), ముళ్లపూడి మురళీకృష్ణ (పశ్చిమగోదావరి), గొల్లపూడి మోహనరావు (కృష్ణాజిల్లా), శాఖమూరి పేరయ్య (గుంటూరు), పెంట్యాల సాంబశివరావు(ప్రకాశం), తల్లా రమేష్(నెల్లూరు), సి.అశోక్‌కుమార్ (చిత్తూరు), కె.నాగేశ్వరరావు (వైఎస్సార్ కడప), ఎం.ఓబయ్య( అనంతపురం), పి.యాగంటిరెడ్డి(కర్నూలు) అవార్డులు అందుకున్నారు. పురస్కారాలు అందుకున్న అధికారులు డిప్యూటీ డెరైక్టర్ బి.ఎస్ సుబ్బయ్యనాయుడు (అనంతపురం), కమిషనరేట్‌కు చెందిన ఏడీహెచ్ ఎస్.వి.రతన్ ఆచార్యులు, అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ హార్టికల్చర్ డి. మధునూదనరెడ్డి (ప్రొద్దుటూరు), పి.జెనమ్మ (కందుకూరు), చంద్రశేఖర్ (అనంతపురం), హరేంద్ర (కుప్పం), ఎం.డి. అబ్దుల్ రహీం (శ్రీకాకుళం)లతో పాటు మైక్రో ఇరిగేషన్, సీఐఐ ప్రతినిధులకు, సంస్థలకు, కంపెనీలకు కూడా అవార్డులు అందించారు