ఉద్యానం... అధ్వానం
– సేవలు అందించని ఉద్యానవన శిక్షణా కేంద్రం
– ఓ అధికారి సెలవులో వెళ్లడమే కారణం
– తీవ్ర ఇబ్బందుల్లో పండ్లతోటల రైతులు
అనంతపురం అగ్రికల్చర్ : ఈ ఏడాది ఉద్యానశాఖకు రూ.50 కోట్లు బడ్జెట్ కేటాయించారు. స్టేట్‌ప్లాన్, ఎంఐడీహెచ్, ఆర్‌కేవీవై కింద వివిధ రకాల పథకాలను మండలాలు, డివిజన్ల వారీగా లక్ష్యాలు పెట్టుకున్నా అవి అనుకున్న విధంగా అమలు కావడం లేదు. ఓ వైపు పథకాలు నత్తనడకన కొనసాగుతుండగా మరో వైపు రైతులకు కొంతవరకు మేలు చేసే ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రం కార్యకలాపాలకు పూర్తీగా స్వస్తిపలికారు. నెలన్నర రోజులుగా ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించకపోవడంతో సరైన యాజమాన్య పద్ధతులు, ఇతరత్రా సాంకేతిక సలహాలు అందక పండ్లతోటల రైతులకు కష్టాలు తప్పడం లేదు.
ప్రిన్సిపల్ చంద్రశేఖర్‌గుప్తా నెల రోజులుగా సెలవులో ఉండటంతో శిక్షణా కేంద్రాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నెలకు ఐదు చొప్పున సంవత్సరానికి 60 శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించిన ఉద్యానశాఖ వాటిని అర్ధాంతరంగా ఆపేసింది. జిల్లా శాస్త్రవేత్తలతో పాటు తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చే శాస్త్రవేత్తలు ఇస్తున్న సూచనలు, సాంకేతిక సలహాలు ఉద్యాన రైతులకు కొంత వరకు వెసులుబాటు ఉండేది.
పండ్లు, పూల, ఔషధమొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా సూక్ష్మసాగు తదితర ఉద్యాన పంటలు 1.70 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో సాగులో ఉండటంతో సీజన్ వారీగా పాటించాల్సిన సరైన సస్యరక్షణ, పోషక, సమగ్ర యాజమాన్య పద్ధతులు, సాంకేతిక సలహాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. శిక్షణా కార్యక్రమాలు నిలిచిపోవడంతో టెక్నికల్ హెచ్‌ఓ జి.చంద్రశేఖర్‌పైనే ఎక్కువ భారం పడుతోంది. కార్యాలయ విధులు, నివేదికల తయారీ, రైతులకు సాంకేతిక సలహాలు, సస్యరక్షణ సిఫారసులు, క్షేత్రస్థాయి పర్యటనలు తదితర వాటితో చంద్రశేఖర్ ఇబ్బంది పడుతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా శిక్షణా కేంద్రం ద్వారా కార్యక్రమాలు యథావిధిగా సాగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.