జిల్లాలో రైళ్ల రాకపోకలు బంద్
–వర్షం కారణంగా 34 రైళ్ల రద్దు
–పిడుగురాళ్ల–సత్తెనపల్లి మధ్య కొట్టుకుపోయిన ట్రాక్
–ఇక్కట్లలో ప్రయాణికులు
నల్లగొండ క్రైం :
వర్షం కారణంగా జిల్లాలో రైళ్ల రాకపోకలు గురువారం పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు రైళ్ల రాకపోకలు కొనసాగలేదు. గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల – సత్తెనపల్లి మధ్య భారీ వర్షానికి రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. అదేమార్గంలో మరొకొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌ల కింద కంకర కొట్టుకుపోవడంతో పట్టాలు వరద నీటిలో తేలియాడుతున్నాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని 70 కిలో మీటర్ల రైల్వే ట్రాక్ పటిష్టంగా ఉన్నప్పటికీ గుంటూరు జిల్లాలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన కారణంగా జిల్లా మీదుగా వెళ్లే 34 రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. గురు, శుక్రవారాల్లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ఖాజీపేట్ మీదుగా దారి మళ్లించారు. రైళ్ల రాకపోకల పునరుద్ధరణ అంశం అర్ధరాత్రి తర్వాతనే తేలుతుందని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్వే అధికారులు, ఇంజనీర్లు పిడుగురాళ్లకు చేరుకున్నారు. గుంటూరు వరకు రైలు ట్రాక్‌లను పూర్తిస్థాయిలో డెమో రైలు ద్వారా పరిశీలించిన తర్వాతనే రాకపోకలను పునరిద్ధరిస్తారని అంటున్నారు.
రద్దయిన రైళ్లివి...
తిరుపతి – ఆదిలాబాద్, సికింద్రాబాద్ – తిరుపతి, హైదరాబాద్ – నర్సాపూర్, నర్సాపూర్ – హైదరాబాద్, ఖాజీపేట – రేపల్లే, రేపల్లే – ఖాజీపేట, గుంటూరు – సికింద్రబాద్, వికారాబాద్ – గుంటూరు రైళ్లను రద్దు చేశారు.
దారి మళ్లించినవి..
భువనేశ్వర్ – సికింద్రాబాద్ రైలును వయా ఖాజీపేట మీదుగా, సికింద్రాబాద్ – భువనేశ్వర్ రైలును వయా ఖాజీపేట మీదుగా, హైదరాబాద్ – చెన్నైను గుంతకల్ మీదుగా, తిరుపతి – సికింద్రాబాద్‌ను గుంతకల్ మీదుగా, పూణే – బోంబాయిను ఖాజీపేట మీదుగా, నాగర్‌సోల్ – నర్సాపూర్, లోకమాన్యతిలక్ టెర్మినల్ – కాకినాడ, సికింద్రాబాద్ – హౌరా ట్రైన్లను ఖాజీపేట మీదుగా దారి మళ్లించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రద్దు చేసిన ట్రైన్ల వివరాలను స్టేషన్లలోని నోటీస్ బోర్డుల్లో ఉంచారు.