విద్యుత్ చౌర్యంపై కేసులు
-
రూ.30లక్షల అపరాధరుసుం విధింపు
నెల్లూరు(టౌన్) : జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 138 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మనోహరరావు తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్‌లో ఉన్న విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల నుంచి వచ్చిన 120 మంది విజిలెన్స్, ట్రాన్స్‌కో అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారన్నారు. కొండాపురం, కలిగిరి, కావలి రూరల్, బోగోలు, దగదర్తి, సంఘం, నెల్లూరు రూరల్, ముత్తుకూరు, సైదాపురం, రాపూరు, నాయుడుపేట రూరల్, డక్కిలి ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 138మందిపై కేసులు నమోదు చేసి, వారికి రూ.30 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. వాటిలో 61 మీటరు బైపాస్, 50 లైన్ నుంచి నేరుగా కనెక్షన్, 10 గృహా సర్వీసులు వ్యాపారానికి వినియోగం, 17 అదనపు లోడ్లు ఉన్నాయన్నారు. కావలి రూరల్, బోగోలు ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 24 మంది ఆక్వా వినియోగదారులపై కేసులు నమోదు చేసి రూ.20 లక్షలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు రానున్న రోజుల్లో మరిన్ని తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డీపీఈ ఎస్‌ఈ రవి, నెల్లూరు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సీఐ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.