సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో ఏళ్లతరబడి తిష్టవేసి..అందినకాడికి దండుకుంటున్న అధికారులను బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్న తరుణంలోనే...అసెంబ్లీలో ఏకీకృత సర్వీస్ రూల్స్ బిల్లును ప్రవేశపెట్టడంతో పలువురి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు బదిలీ జరిగినా మహా అయితే ఒక సర్కిల్ నుంచి మరో సర్కిల్‌కు.. ఒక జోన్ కార్యాలయం నుంచి మరో జోన్ కార్యాలయానికి జరిగేది. ఎంత బదిలీ అయినా నగరంలోనే తిరిగి పోస్టింగ్ లభించేది.
అంతేకాదు...స్థానచలనం జరిగినా పై ఆదాయం ఆగేది కాదు. ఎక్కడున్నా తమ ‘పని’ తాము కానిచ్చేవారు. అక్రమార్కులపై బదిలీల వేటుకు ఉన్నతాధికారులు ఓవైపు కసరత్తు చేస్తుండగా, మరోవైపు శనివారం అసెంబ్లీలో ఏకీకృత సర్వీసు రూల్స్ బిల్లును ప్రవేశపెట్టడంతో ఈ బిల్లు ఆమోదం పొందాక సదరు బదిలీలు జరిగే అవకాశం ఉంది.
బిల్లు ఆమోదం తర్వాత జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నవారిని రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా బదిలీ చేయవచ్చు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, కుడా తదితర సంస్థల ఉద్యోగులను ఇతర సంస్థలకు బదిలీ చేసే అవకాశం లేదు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమల్లోకి వస్తే వీరిని ఒక సంస్థలోని వారిని మరో సంస్థలోకి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు.
అదే ఇప్పుడు పలువురు ఉద్యోగులు, అధికారుల్లో ఆందోళన రేపుతోంది. ఇప్పటి దాకా బదిలీ అంటే నగరంలోనే ఒకచోటునుంచి మరోచోటుకు. మహా అయితే కొద్దినెలల తర్వాత పైరవీలతో తిరిగి కోరుకున్న చోటుకు చేరుకునేవారు. వీటిని ఆసరా చేసుకొనే పలువురు అవినీతి సామ్రాట్‌లు పేట్రేగిపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం యూనిఫైడ్ సర్వీస్‌రూల్స్ అమలుకు చర్యలు చేపట్టింది. ఇవి అమల్లోకి వచ్చాక ఆయా సంస్థలు తమ చట్టం, నిబంధనల్లోని బదిలీలకు సంబంధించిన సెక్షన్ లను సవరించుకోవాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత రూల్స్‌నూ రూపొందించాల్సి ఉంటుందని సంబంధిత అధికారి పేర్కొన్నారు.
ఈ రూల్స్ అమల్లోకి వస్తే జీహెచ్‌ఎంసీలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా ఇది వర్తించనుందని చెప్పారు. అయితే జిల్లా, జోన్, రాష్ట్రస్థాయిలో మూడంచెల వ్యవస్థ ఉంటుందా.. లేక కేవలం జిల్లా, రాష్ట్రస్థాయిలే ఉంటాయా..? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎటొచ్చీ ఇప్పటి వరకు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం లేని పరిస్థితి ఉండగా, తాజా బిల్లుతో బదిలీపై దూరప్రాంతానికి వెళ్లక తప్పదు.
అవినీతిపరులకు స్థానచలనం..
బిల్లు ఆమోదం పొంది, రూల్స్ సవరణజరిగి, బదిలీలు చేపట్టేందుకు సమయం పట్టనుండటంతో ఈ సంవత్సరాంతంలోగా ఈ బదిలీలు జరిగే అవకాశం లేదని భావిస్తున్నారు. కొత్త సంవత్సరంలో కొత్త రూల్స్‌తో బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుందని అంచనా వేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, ట్యాక్స్, ఇంజినీరింగ్ విభాగాలు అవినీతిలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ విభాగాల్లోని అవినీతి పరులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండటంతో అవినీతిపరులు ఆందోళనకు గురవుతున్నారు. అనుకూల ప్రాంతాల కోసం పలువురు ఉద్యోగులు గట్టి పైరవీలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇతర ప్రభుత్వ విభాగాలనుంచి జీహెచ్‌ఎంసీకి డిప్యూటేషన్ పై వచ్చి ఏళ్లతరబడి ఇక్కడే పాతకుపోయిన వారికి దడ పట్టుకుంది. డిప్యూటేష¯ŒSపై వచ్చిన వారు ఏడాదికోమారు పొడిగింపులతో గరిష్టంగా ఐదేళ్ల వరకు ఉండవచ్చు. కానీ ఈ రూల్స్‌ను సైతం పాటించకుండా దాదాపు దశాబ్దం, అంతకన్నా ఎక్కువకాలంగా పనిచేస్తున్న వారు మునిసిపల్, పబ్లిక్‌హెల్త్, మెడికల్, తదితర విభాగాలకు చెందినవారున్నారు.
తమనెవరూ ఏమీ చేయలేరనే ధీమాతో వీరు సాగిస్తున్న అవినీతి కార్యక్రమాలతో జీహెచ్‌ఎంసీకి చెడ్డపేరు వస్తోంది. దీన్ని తొలగించేందుకు వీరిని బదిలీ చేయకతప్పదనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. త్వరలోనే యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమల్లోకి రానుండటంతో పలువురు డిప్యూటీ కమిషనర్లు, అడిషనల్/జోనల్ కమిషనర్లతో సహ ఇంజినీర్లు, తదితరులకు స్థానచలనం తప్పదని భావిస్తున్నారు.