పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు
-
విద్యావికాసానికి ‘పడిశాల’ సేవలు ఎనలేనివి
-
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
రామన్నపేట : తెలంగాణ ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాల నియామకం పారదర్శకంగా జరుగుతోదని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. నగరంలోని బట్టలబజార్‌లో గల పడిశాల వీరభద్రయ్య విద్యాసంస్థలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న శతజయంతి ఉత్సవాలను మంగళవారం ఆయన ప్రారంభించారు.
తొలుత వీరభద్రయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంరద్భంగా మాట్లాడుతూ.. విద్య వ్యాపారమైన నేటి సమాజంలో ఎన్నో అటుపోట్లను ఎదుర్కొంటూ సేవా దృక్పథంతో బాలికల కోసం విద్యాసంస్థలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎయిడెడ్ పాఠశాలకు చేయూతనందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అర్హులకే ఉద్యోగాలు లభించేలా వ్యవహరిస్తున్నామన్నారు. వీరభద్రయ్య సంతానం కూడ ఆయన మార్గంలోనే వారి ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని అభినందించారు. విద్యాసంస్థ చైర్మన్ రాజగురు లింగప్రసాద్ మాట్లాడుతూ విద్యలో కొనసాగుతున్న వివక్షను నిర్మూలించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపక బృందం రచించిన వివిధ ప్రక్రియల సావనీర్‌ను ఆవిష్కరించారు. వీరభద్రయ్య సతీమణి వరలక్ష్మమ్మను ఘంటా చక్రపాణి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాఘవరాజు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాణి ప్రియదర్శిని, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజు శ్రీ పాల్గొన్నారు.