తవ్వకాలు జరిపిన ప్రదేశంలో చిన్న శివలింగం
గుప్త నిధుల కోసం తవ్వకాలు
Published Wed, Feb 1 2017 9:42 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
హుళేబీడు(ఆలూరు రూరల్): గ్రామశివారులోని శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయానికి వెనకభాగంలో కాళబైరవ, నీలకంఠేశ్వరస్వామి, జోడు బసవన్నల విగ్రహాలు ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. అర్ధరాత్రి అక్కడ జేసీబీ లైట్ల వెలుగులు, గుర్తు తెలియని వ్యక్తుల మోటార్ సైకిళ్లు అటువైపు వెళ్లడంతో ఆంజనేయస్వామి ఆలయంలో నిద్రిస్తున్న శివభక్తులు గమనించి ఆలూరు ఎస్‌ఐ ధనుంజయకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన తన సిబ్బందితో అక్కడికి చేరుకునేలోపు నిదితులు జేసీబీ (ఏపీ21 బీకే0975), మోటార్‌సైకిల్(ఏపీ21 బీఏ9996)ను అక్కడే వదిలేసి పరారయ్యారు.
– గతంలోనూ ఇదే ప్రదేశంలో తవ్వకాలు
గతంలో కూడా ఇదే ప్రదేశంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెద్దఎత్తున తవ్వకాలు జరిపారు. అప్పట్లో అక్కడ నిధులు దొరికినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం తవ్వకాలు జరిగే ప్రదేశంలో జోడి శివలింగాలు, నీలకంఠేశ్వరస్వామి, కాలభైరవ విగ్రహాలు చెల్లాచెదురుగా పడేశారు. నీలకంఠేశ్వరస్వామి విగ్రహాలు ఉన్న కిందిభాగంలో దాదాపు 15 అడుగుల లోతులో జేసీబీ ద్వారా తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపిన చోట శివలింగానికి కిందిభాగంలో ఉన్న శిలాఫలకం మాత్రమే ఉంది. శిలాఫలకంపైన ఉన్న చిన్న శివలింగం కనిపించడంలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
– వర్షం కోసం పూజలు చేసే ప్రదేశంలోనే తవ్వకాలు
యేటా గ్రామస్తులు ఖరీఫ్, రబీ సీజన్ల ముందు వర్షాలు రాకపోతే ముందుగా గ్రామశివారులో ఉన్న ఆంజనేయస్వామికి అభిషేకం జరుపుతారు. అక్కడి నుంచి ఆలయం వెనుకభాగంలో ఉన్న కాళబైరవ, నీలకంఠేశ్వరస్వామి, బసవన్నల విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. ఆ విగ్రహాలకు అక్కడ పూజలు చేస్తే వర్షాలు పడతాయని వారి నమ్మకం. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపేవారు కాలభైరవ, నీలకంఠేశ్వరస్వామి, జోడిశివలింగాలు విగ్రహాలకు ఎదురుగా దాదాపు 200 మీటర్ల దూరంలో పక్షి ఆకారంలో కల్గిన ఓ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి ముందుగా తవ్వకాలు జరిపేవారు నిమ్మకాయలు, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించినట్లు తెలిసింది.
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
హుళేబీడు గ్రామ శివారులో మంగళవారం అర్ధరాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన వారిని ఆలూరు పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆలూరు సీఐ అబ్దుల్‌గౌస్, ఎస్‌ఐ ధనుంజయ విలేకరులతో మాట్లాడారు. గుప్తనిధులు తవ్వకాలు జరిపేందుకు ఆదోని ప్రాంతానికి చెందిన వడ్డే రాజు, మధు, మహానందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో మరో వ్యక్తి రామచంద్రయ్య ఉన్నట్లు చెప్పారు. మరి కొంతమందిని కూడా తవ్వకాలు జరిపిన వారిలో ఉన్నట్లు తమకు తెలిసిందన్నారు. తవ్వకాల్లో వారి పేర్లు ఉన్నాయా లేదానన్న విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామన్నారు.
Advertisement
Advertisement