విజయనగరంలో గిరిజన విశ్వవిశవివిద్యాలయం
ద్వారకా తిరుమల : కేంద్ర ప్రభుత్వ సహకారంతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని విజయనగరంలో ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు భూసేకరణ కూడా జరిపినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. ద్వారకా తిరుమల సాంఘిక సంక్షేమ గురుకుల, బాలికల జూనియర్ కళాశాలలో గురువారం క్యూరియాసిటీ కార్నివాల్2016 (వైజ్ఞానిక ప్రదర్శన)ను ఆయన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్‌లను సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రులు తిలకించారు. ఆ తరువాత జరిగిన సభలో మంత్రి రావెల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను రెసిడెన్షియల్ పాఠశాలలుగా తీర్చిదిద్ది, పేద, బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. మంత్రి సుజాత మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు విద్యలో జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. అందుకు ఉపాధ్యాయులు మరింతగా కృషిచేయాలన్నారు. అనంతరం మంత్రి రావెలను గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గజమాలతో సత్కరించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి, ఎంపీపీ ప్రసాద్, జెడ్పీటీసీ లక్ష్మీ రమణి, సర్పంచ్ మల్లిపెద్ది ధనలక్ష్మి వెంకటేశ్వరరావు, వెలుగు పాఠశాల ప్రిన్సిపాల్ వై.సుధారాణి పాల్గొన్నారు.