ఇప్పట్లో లేనట్లే..
ఏప్రిల్‌లోనే టీఆర్‌ఎస్ కమిటీల ప్రకటన
ఆశగా ఎదురు చూస్తున్న గులాబీ నేతలు
సంస్థాగత ఎన్నికల తర్వాతే పదవులు
వరంగల్ : అధికార టీఆర్‌ఎస్‌లో పార్టీ పదవుల పందేరం ఇప్పట్లో లేదని తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్‌లో జరిగే సంస్థాగత ఎన్నికల తర్వాతే అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ కొత్త కమిటీలు ఏర్పాటు చేసేలా టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాలు ఏర్పాటైన రోజునే పార్టీ కమిటీలను నియమించాలని టీఆర్‌ఎస్ అధిష్టానం తొలుత భావించింది. జిల్లా కమిటీలతోపాటే రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. దీంతో పార్టీ పదవులను ఆశిస్తున్న గులాబీ నేతలు తమకు అవకాశాలు వస్తాయని భావించారు. అధికార పార్టీలో పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో కమిటీల ప్రకటన అంశం తాత్కాలికంగా వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ఆ తర్వాత ఈ అంశం పూర్తిగా పక్కకు పోయింది. ఇలాంటి పరిస్థితిలో టీఆర్‌ఎస్ అధిష్టానం కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్‌లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రతి రెండేళ్లకోసారి ఏప్రిల్‌లో జరుగుతుంది. 2015లో టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగింది. అదే ఏడాది ఏప్రిల్‌లో జిల్లా కమిటీ ఎన్నికలు జరిగాయి. వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి రవీందర్‌రావు, అర్బన్ కమిటీ అధ్యక్షుడిగా నన్నపునేని నరేందర్ ఎన్నికయ్యారు. కేవలం అధ్యక్షుల ఎన్నికతోనే కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయింది.