
మిగిలింది నలుగురే!
♦ టీఆర్‌ఎస్ ‘ఆపరేషన్ నల్లగొండ’ సక్సెస్
♦ మండలి డిప్యూటీ చైర్మన్ నుంచి నల్లగొండ ఎంపీ దాకా
♦ కీలక నేతలంతా టీఆర్‌ఎస్‌లోకి...
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉన్న నల్లగొండలో ఆ పార్టీని టీఆర్‌ఎస్ దాదాపు ఖాళీ చేసేసింది. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని వారి కంచు కోటను బద్దలు కొట్టింది. ఇప్పుడు నల్లగొండ కాంగ్రెస్‌లో మిగిలింది నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీయే. కాంగ్రెస్ శాసనసభా పక్షనేత కె.జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమ ణి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇందులోనూ నలుగురు నేతలు రెండు కుటుంబాలకు చెందిన వారే. వీరు మినహా అక్కడక్కడా ఒకరిద్దరు నేతలు మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్‌లో మిగిలారంటే నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ ఎంత పకడ్బందీగా వ్యూహాన్ని అమలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ జిల్లాలో 8మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్‌లతో టీఆర్‌ఎస్ బలీయంగా మారింది.
ఒకరి వెనుక మరొకరు..
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ నల్లగొండ జిల్లాలో చాప కింద నీరులా సాగింది. కాంగ్రెస్ కంచుకోటగా గుర్తింపు పొందిన ఈ జిల్లాను టీఆర్‌ఎస్ నేతలు వ్యూహాత్మకంగా టార్గెట్ చేశారు. తొలుత అప్పటికే శాసనమండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. తర్వాత ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ‘ఆకర్ష్’ ఊపందుకున్నది మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్‌తోనే. ఆయన అనూహ్యంగా అధికార పార్టీలోకి వెళ్లి కాంగ్రెస్‌కు షాకిచ్చారు. ఆయనతో పాటు పలువురు జెడ్పీటీసీలు, దేవరకొండ నియోజకవర్గ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహ కార పరపతి సంఘం, మదర్ డెయిరీ చైర్మన్లు వలస బాట పట్టారు.
అదే సమయంలో ఒక్కొక్కరుగా మున్సిపల్ చైర్మన్లు కూడా చేరారు. మున్సిపల్ చైర్మన్‌ల ఎన్నిక సమయంలోనే మంత్రి జగదీశ్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని సూర్యాపేట మున్సిపాలిటీలో చక్రం తిప్పారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కౌన్సెలర్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని మున్సిపల్ చైర్మన్ చేశారు. తర్వాత దేవరకొండ, భువనగిరి, హుజూర్‌నగర్, కోదాడ, నల్లగొండ మున్సిపల్ చైర్మన్లు కూడా గులాబీ గూటికి చేరారు. వారంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. చివరికి కాంగ్రెస్‌కు మిగిలింద ల్లా ఒక్క మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సనే. ఆమె కూడా పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగినా ఆచరణలోనికి రాలేదు. వీరేగాకుండా వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సెలర్లు, జెడ్పీటీసీలు, గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు వందల సంఖ్యలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఓ ఎంపీ, ఒక ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, అక్కడక్కడా నియోజకవర్గాల ఇన్‌చార్జులు, 10 మంది వరకు జెడ్పీటీసీలే కాంగ్రెస్‌కు మిగిలారు.
జానారెడ్డికీ ఎఫెక్ట్!
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా, రాష్ట్రంలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన సీఎల్పీ నేత జానారెడ్డికి కూడా అధికార పార్టీ ఎఫెక్ట్ తప్పలేదు. గత డిసెంబర్‌లో జరిగిన నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయన అనుంగు అనుచరులుగా గుర్తింపు పొందిన నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. జానారెడ్డి ఆత్మబంధువుగా పేరున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. జానారెడ్డి మాత్రమే కాదు ఉత్తమ్, కోమటిరెడ్డి, పద్మావతిలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల పరిధిలోనూ పెద్ద ఎత్తున కేడర్ గులాబీ పార్టీ బాట పట్టడం గమనార్హం.