
గ్రూప్-2కు పకడ్బందీ ఏర్పాట్లు
వికారాబాద్: పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వచ్చేనెలలో గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ సభ్యుడు విఠల్ తెలిపారు. వచ్చేనెల 11, 13 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల ఏర్పాట్లపై వికారాబాద్‌లో జేసీ సురేష్ పొద్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్రూప్-2 పరీక్షకు 8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్, అక్రమాలు చోటుచేసుకుంటే బాధ్యులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పరీక్షల సక్రమ నిర్వహణకు అధికార యంత్రాంగం సహకరించాలని ఆయన సూచించారు. కొత్త జిల్లాలు ఆవిర్భవించక ముందు 500 పోస్టుల ఖాళీలు భర్తీ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిందని, కొత్త జిల్లాల ఆవిర్భావం తరువాత అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేయి పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఐదు వేలకు పైగా అభ్యర్థులు ఎంపికై పలు శాఖల్లో పనిచేస్తున్నారని గుర్తు చేశారు.
మరో 5000మంది ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి ఎంపికకు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రూప్-2 పరీక్షలు పూర్తి కాగానే మరో ఆరు వేల పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రెండున్నరేళ్ల కాలంలో 26 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లక్షల మంది అత్యధికంగా ఒకేసారి గ్రూప్-2 పరీక్షలు రాశారని, ప్రస్తుతం ఒకేసారి 8 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోనే 400 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశామని, సుమారు 3.50 లక్షల మంది పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.