'చీమ కుట్టినట్లైనా లేదే!'
వేంపల్లె: రైతులు వరుస కరువులతో కొట్టుమిట్టాడుతుంటే సీఎం చంద్రబాబు నాయుడుకు చీమ కుట్టినట్లైనా లేదని కాంగ్రెస్ నేత ఎన్.తులసిరెడ్డి ధ్వజమెత్తారు. గోదావరి పుష్కరాల్లో నిండా మునిగి తేలుతూ ప్రచార ఆర్భాటానికే ఆసక్తి చూపుతున్న సీఎం చంద్రబాబు.. రైతుల కష్టాల గురించి పట్టించుకోకపోవడం తగదన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా వేంపల్లెలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పుష్కరాల కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని రైతులకు 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పంటల బీమా రూ.2,560 కోట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు. 2012-13 రబీ సీజన్‌లో వైఎస్‌ఆర్ జిల్లాలో 70 వేల మంది శనగ, పొద్దుతిరుగుడు రైతులు బీమా ప్రీమియం చెల్లించారని.. రెండేళ్లుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారన్నారు.
సీఎం జపాన్, చైనా, సింగఫూర్ దేశాల్లో తిరుగుతూ రైతుల సమస్యలను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఓదార్చి, వారి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్తాన్ని నిలదీసేందుకు ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారన్నారు. అప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే ప్రత్యక్ష ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. పది రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ప్రధాని నరేంద్రమోడి స్వచ్ఛ భారత్.. అంటుంటే, చంద్రబాబు చెత్తాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు.