తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నదీతీరం
-
ఎతిపోతల మరోసారి సర్వేకు ఈఎన్‌సీ ఆదేశం
-
డీపీఆర్ పూర్తయిన ఆర్నెళ్లకు మళ్లీ సర్వే
-
మూడు రిజర్వాయర్లతో మొదటి డీపీఆర్
-
ప్రాజెక్టు నివేదికపై జీఓ ఆశలకు గండి
-
ఆర్డీఎస్ చివరి భూములకు నీళ్లందేనా?
జూరాల: ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలు తీర్చే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కథ మళ్లీ మొదటికొచ్చింది. రెండేళ్లుగా ప్రతిపాదనలు, సర్వేలు, డీపీఆర్‌తో కాలయాపన చేసిన ప్రభుత్వం ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం ఇస్తుందనుకున్న సమయంలో కొత్త మెలికపెట్టింది. సర్వేలు నిర్వహించి.. డీపీఆర్‌ను ఉన్నతాధికారులకు పంపడం, ప్రభుత్వం చెంతకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని 70వేల ఎకరాలకు సాగునీరు అందించేలా గత ఫిబ్రవరిలో రూ.835 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ పూర్తిచేసి నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులకు పంపించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలను కుదించి కేవలం ఒక పంపుతో రిజర్వాయర్ లేకుండా మళ్లీ సర్వే చేయాలని మంగళవారం హైదరాబాద్‌లో ఈఎన్‌సీ సమావేశంలో నిర్ణయించారు. ఇదిలాఉండగా, దశాబ్దాలుగా ఆర్డీఎస్‌లో 30వేల ఎకరాలకు మించి సాగునీరు అందని దైన్యం నెలకొంది. నీటి వాడకం విషయంలో రెండు జిల్లాల రైతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం చూపడం లేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామన్న టీఆర్‌ఎస్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చింది.
తుమ్మిళ్ల ఇక్కడే..
వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల వద్ద ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఆర్డీఎస్ చివరి ఆయకట్టు భూములకు మూడు రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించాలన్నది ప్రణాళిక. ఏడాది క్రితం డీపీఆర్ సర్వేకు అనుమతివ్వగా.. గత ఫిబ్రవరిలో పూర్తిచేశారు. సీఈ ద్వారా ప్రభుత్వ సలహాదారుకు చేరిన ఫైల్ ఈఎన్‌సీకి చేరడానికి చాలాసమయమే పట్టింది. చివరికి ఈఎన్‌సీ సమావేశంలో తిరిగి సర్వేచేయాలని నిర్ణయించారు. తుంగభద్ర నుంచి ఒక పంపును ఏర్పాటుచేసి నేరుగా ఆర్డీఎస్ ప్రధానకాల్వలోకి నీటిని వదిలేలా సర్వేచేయాలని ఆదేశించారు. దీంతో పథకంలో డీపీఆర్ ద్వారా సర్వే చేపట్టిన మూడు రిజర్వాయర్లను తొలగించడంతో పాటు పంప్‌హౌస్‌లో ఒకే మోటార్‌ను ఏర్పాటుచేయాలని ఉన్నతాధికారులు సూచించారు.
ఎత్తిపోతల లక్ష్యం ఇదే..
ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్(ప్రాజెక్టుల సమగ్ర నివేదిక)ను రూ. 835కోట్ల అంచనా వ్యయంతో ఈఎన్‌సీకి జనవరిలో నివేదిక అందించారు. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నదీతీరంలో పంప్‌హౌస్‌ను నిర్మించనున్నారు. అక్కడి నుంచి నీటిని మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తారు. అక్కడినుంచి జూలకల్, వల్లూరు వద్ద నిర్మించే రెండు రిజర్వాయర్లకు మళ్లిస్తారు. ఇక్కడినుంచి ఆర్డీఎస్ డీ– 23 నుంచి అలంపూర్ మండలంలోని చివరి ఆయకట్టుకు నీళ్లందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ ఎత్తిపోతల ద్వారా 8 టీఎంసీల నీటిని 90రోజుల్లో తుంగ¿¶ ద్ర నుంచి పంపింగ్ చేయాలని రూపొందించారు. సుమారు 80వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు అందించే విధంగా డిజైన్‌చేశారు. ఆగస్టు మొదటì వారం నుంచి అక్టోబర్ చివరివరకు నదిలో వరద ఉన్న సమయంలో పంపింగ్ పూర్తిచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిళ్ల సర్వేను వీఎస్ మ్యాప్ సంస్థకు రూ.18లక్షల అంచనాతో జూన్‌లో అప్పగించగా.. డిసెంబర్ చివరివారంలో పూర్తిచేశారు.
కొత్త ఆదేశాలతో ఇబ్బందులు
ఒక పంపును ఏర్పాటుచేసి నేరుగా ఆర్డీఎస్ ప్రధానకాల్వలకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ఆలోచన కొత్త సమస్యలకు తెరతీసేలా ఉంది. ఈ ప్రక్రియ తుంగభద్ర నదిలో కేవలం వరద ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎక్కువ మొత్తంలో పంపింగ్ చేసి నీటిని నిల్వచేసుకోవడానికి అవకాశం ఉండదు. పంప్ చెడిపోయినా నదిలో వరద తగ్గినా లిఫ్ట్ ఆగిపోతుంది. దశాబ్దాలుగా సాగునీరందని ఆర్డీఎస్ చివరి రైతులకు ఎత్తిపోతల ద్వారా ఎప్పుడు నీళ్లొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులకు మళ్లీ నీటికష్టాలు తప్పేలాలేవని తెలుస్తోంది.
ఈఎన్‌సీ ఆదేశాలతో సర్వేచేస్తాం
ఈఎన్‌సీ సూచనల మేరకు ఆర్డీఎస్ పంప్‌హౌస్, నేరుగా కాల్వలోకి నీటిని వదిలే మొదటిస్టేజ్‌పై సర్వేచేస్తాం. ఒక స్టేజీ పూర్తయిన తరువాత అవసరాన్ని బట్టి మరో స్టేజ్ పనులు చేపట్టవచ్చని ఈఎన్‌సీ ఆదేశించారు. మొదటి దశ సర్వేను త్వరలోనే ప్రారంభిస్తాం. స్టేజ్–1, స్టేజ్–2గా పథకాన్ని చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించారు.
– ఖగేందర్, ప్రాజెక్టుల సీఈ
సాగునీటి సమస్యపై తిరకాసులొద్దు
తుమ్మిళ్ల ద్వారా మూడు రిజర్వాయర్లలో 1060 క్యూసెక్కుల నీటి పంపింగ్ సామర్థ్యం కలిగిన ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు డీపీఆర్ నిర్వహించడం హర్షణీయం. సమస్య పరిష్కారమవుతున్న సమయంలో ఉన్నతాధికారులు మళ్లీ తిరకాసు పెట్టి రిజర్వాయర్లను తొలగించడం, ఒకే పంపును ఏర్పాటుచేయాలని చెప్పడం సరికాదు. ఇకనైనా రైతులను ఆదుకునేలా నిర్ణయం తీసుకోవాలి.
– సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్