
‘తుని ఘటనతో నాకెలాంటి సంబంధంలేదు’
గుంటూరు: దురుద్దేశంతోనే తనకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తుని ఘటనకు సంబంధించి ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ విచారణ నిమిత్తం ఇవాళ గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, చట్టంపై గౌరవంతోనే విచారణకు వచ్చినట్లు భూమన తెలిపారు. కాపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కాపుల న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని ఆయన అన్నారు.
కాగా ఈ ఏడాది జనవరి 31న కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపు ఐక్యగర్జన సభ నిర్వహించిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి భూమనకు సీఐడీ నోటీసులు ఇచ్చింది.