
‘తప్పు చేయలేదు, ఎలాంటి భయంలేదు’
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని మంగళవారం సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు ఎనిమిది గంటల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారణ జరిపారు. విచారణ పూర్తయిన అనంతరం భూమన మీడియాతో మాట్లాడుతూ తుని ఘటనకు సంబంధించి తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికీ భయపడేది లేదన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావడానికి తాను సిద్ధమన్నారు. కాపు ఉద‍్యమానికి తాను నైతిక మద్దతు మాత్రమే ఇచ్చానని, తుని ఘటనతో తనకు రవ్వంత కూడా సంబంధం లేదన్నారు.
ఇక ఈ కేసులో ముందుగా చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇచ్చి, ఆయన్ని విచారణ జరపాలన్నారు. చంద్రబాబు చెప్పడం వల్లే ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో తనను విచారణకు పిలిచారని భూమన వ్యాఖ్యానించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తుని కేసులో వైఎస్ఆర్ సీపీ నేతలను ఇరికించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్, జడల నాగరాజు తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని భూమన వ్యాఖ్యానించారు. పరిటాల రవి హత్య అనంతరం జరిగిన పరిణామాలతో కూడా చంద్రబాబుకు సంబంధం ఉందన్నారు. కాగా తుని ఘటనపై ఇప్పటికే భూమన మూడుసార్లు విచారణకు హాజరయ్యారు.