పల్టీలు కొడుతున్న పసుపు ధరలు
► కాడి రకం ధర పదిరోజుల క్రితం రూ.6100 నేడు రూ.5700
► ఉంట రకం రూ.5600 నుంచి రూ.5170కు పడిపోయిన వైనం
► ఆందోళన చెందుతున్న రైతులు
కడప అగ్రికల్చర్: ఈ ఏడాది పసుపు ధరలు బాగుంటాయని రైతులు ఎంతో ఆశించి సాగు చేస్తే తీరా చేతికందే సమయంలో ధరలు పడిలేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. పదిరోజుల క్రితం కాడి, ఉంట రకాల ధరలు ఆశాజనంగా ఉండడంతో ఇంకా పైపైకి పోతుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే మార్కెట్‌లో ధరలు ఎగుడుదిగుడుగా ఉండడంతో రైతులు మథనపడుతున్నారు. సాగు సమయంలో క్వింటాలు పసుపు ధర రూ.7000–రూ.8000 ఉండగా నేడు అదే ధర రూ. 5700–రూ.5170 పలుకుతుండడంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు అల్లాడుతున్నారు. పంట కోసం చేసిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు.
జిల్లాలోని మైదుకూరు, ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, సిద్ధవటం, బి మఠం, మండలాల్లో అధికంగాను, మిగిలిన మండలాల్లో తక్కువ విస్తీర్ణంలోను కలిపి 3939 హెక్టార్లలో పసుపు పంట సాగైంది. ప్రస్తుతం పంట నూర్పిడి చేసి, ఉడికించి మార్కెట్‌కు రైతులు తీసుకువస్తున్నారు. మార్కెట్‌లో ధరలు పడిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 10 రోజుల క్రితం క్వింటాలు కాడి రకం ధర రూ.6100 ఉండింది. ఇప్పుడు అదే రకం రూ. 5700లకు పడిపోయింది. అలాగే ఉంట రకం పసుపు ధర రూ.5600 నుంచి రూ.5170 పడిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో క్వింటాలు పసుపు ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు పలికింది. దీంతో రైతులు వ్యవసాయంలో ఇంతకంటే ఏం కావాలని అనందపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి నిరాశాజనకంగా ఉండటం వారిని ఆవేదనకు గురి చేస్తోంది.