‘నీరు’ చెట్టే మింగేసింది!
‘నీరు’ చెట్టే మింగేసింది!
Published Sun, Aug 7 2016 11:33 PM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM
గన్నవరం:
నీరు–చెట్టు అంటూ అధికార పార్టీ నాయకులు చెరువుల్లో ఇష్టరాజ్యంగా తవ్విన మట్టి తవ్వకాలకు మరో ఇద్దరు బలైపోయారు. గన్నవరం శివారు మర్లచెరువులో ఆదివారం బైక్ కడిగేందుకు వెళ్ళిన ఇరువురు విద్యార్థులు చెరువులో లోతుగా తవ్విన గోతిలో ప్రమాదవశాత్తు పడి దుర్మరణం చెందారు. పోలీసుల సమాచారం ప్రకారం...స్థానిక ఎస్సీకాలనీకి చెందిన తిరివీధి నాగేశ్వరరావు కుమారుడు దిలీప్(20) వికెఆర్ కళాశాలలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్ కడిగేందుకని సమీప బంధువెన నాలుగో తరగతి విద్యార్థి నిడమర్తి మణిబాబు(9)ను తీసుకుని మర్లపాడులోని చెరువు వద్దకు వెళ్ళారు. బండిని గట్టుపై ఉంచి బకెట్ సహాయంతో చెరువులోని నీటిని తీసుకువచ్చి శుభ్రం చేస్తుండడం గమనించిన స్థానికులు చెరువు లోతుగా ఉంది వెళ్లొద్దనిహెచ్చరించారు. అయినా ఇద్దరూ బండి పనిలో నిమగ్నమయ్యారు. చెరువుకు వెళ్లిన ఇద్దరూ ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. చెరువు గట్టున బండి, చొక్కాలు, సెల్‌ఫోన్, చెప్పులు ఉన్నప్పటికి దీలిప్, మణిబాబు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. చెరువులో గాలించగా కొద్ది సేపటికి చెరువు గట్టు పక్కన లోతుగా ఉన్న గొయ్యిలో వీరి మృతదేహాలు కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
ఎస్సీ కాలనీవాసుల ఆందోళన
విషయం తెలుసుకున్న ఎస్సీ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తెలుగుదేశం నాయకులు మట్టి కోసం చెరువును ఇష్టారాజ్యంగా తవ్విన గోతుల్లో పడి తమవారు చనిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల గౌడపేటకు చెందిన విద్యార్థి ఇదే చెరువులో పడి మరణించినా, ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైన ప్రమాదాల నివారకు చెరువు గట్టు చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement