ఎస్పీ బ్రహ్మారెడ్డితో పాటు నిందితులు
నరసన్నపేట : జిల్లాలో సంచలనం కలిగించిన నరసన్నపేట హడ్కో కాలనీకి చెందిన మల్లా విజయ్(గవాస్కర్) హత్య కేసులో మరో ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నిందితులను ఎస్సీ బ్రహ్మారెడ్డి విలేకరుల ఎదుట బుధవారం హాజరుపరిచారు. హత్య కేసులో నిందితులైన పొన్నాడ రామచంద్రరావుతో పాటు ఆయనకు ఆశ్రయం ఇచ్చిన వైద్యుడు సోమేశ్వరరావు మిత్రుడు, రణస్థలం ఆయుష్ వైద్యుడు ఎం.సునీల్‌కుమార్‌ను అరెస్టు చేసినట్టు ఎస్పీ చెప్పారు.
సంఘటన జరిగిన రెండు రోజుల్లోనే ఏడుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశామని, తాజాగా వైద్యుని సోదరుడు పొన్నాన రామచంద్రరావును పొందూరు సమీపంలో ఎం.సునీల్‌కుమార్ ఇంటి వద్ద అరెస్టు చేసినట్టు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ సిగ్నల్ ఆధారంగా రామచంద్రరావు ఆచూకీని కనుగొనన్నట్టు తెలిపారు. హత్య కేసులో నిందితునిగా ఉన్న రామచంద్రరావుకు తన ఇంట్లో ఆశ్రయమిచ్చిన ఆయుష్ వైద్యుడు ఎం.సునీల్‌కుమార్‌ను కూడా అరెస్టు చేశామన్నారు. నిందితులను రహస్యంగా ఉంచడం కూడా నేరమే అవుతుందని ఎస్పీ చెప్పారు. విజయ్ హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేసినట్టు తెలిపారు. పోలీసు సిబ్బందిని అభినందించారు. ఎస్పీతో పాటు సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు ఎన్.లక్ష్మణ, నర్సింగరావు ఉన్నారు.