లింగాలఘణపురం, న్యూస్‌లైన్ : సెటిల్‌మెంట్లు.. సుపారీ హత్యలకు జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.. బీహార్‌లాంటి రాష్ట్రాల్లో రూ.6 వేలకో తపంచా.. రూ.200 ఒక తూటా లభిస్తుండడం ప్రైవేట్ గ్యాంగ్‌లకు వరంగా మారింది. నెల్లుట్ల శివారు వడ్డెరకాలనీలో జరిగిన విజయ్ హత్య కోసం నిందితులు ఇదే తరహాలో ఆయుధాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ నెల 23న నెల్లుట్ల శివారు వడ్డెర కాలనీలో శివరాత్రి విజయ్(35) హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఆరు నెలలుగా విజయ్‌ను హతమార్చేందుకు ఎదురు చూస్తున్న అతడి ప్రత్యర్థి పందిగోటి మురళి ఈ పని కోసం పలువురిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అడ్వాన్స్‌గా సుమారు రూ.రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడికి జనగామలో దాబా నిర్వహించే ఓ వ్యక్తితో పరిచయమేర్పడింది. అతడు కిశోర్‌తో విజయ్ హత్యకు రూ.6 ల క్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అందులో అడ్వాన్స్‌గా కిషోర్‌కు రూ.80 వేలు ముట్టజెప్పారు. అనంతరం అతడు తన డైరీ ఫామ్‌లో పనిచేసే బీహార్ కూలీలతో మాట్లాడి అక్కడి నుంచి రూ.6 వేలకు తపంచా, ఒక్కో తూటాను రూ.200కు కొనుగోలు చేసినట్లు సమాచారం. వారు రెండు తపంచాలను అక్కడి నుంచి కొనుగోలు చేసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వస్తున్న నిందితులు భువనగిరి టోల్‌ప్లాజా సమీపంలోని అడవుల్లో తపంచాల పనితీరును రిహర్సల్స్ చేసినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. విజయ్ హత్య కేసులో కారు డ్రైవర్ మినహా ప్రధాన నిందితులంతా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో నిందితులందరిని పోలీసులు రిమాండ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
బతుకుదెరువు కోసం వచ్చి హత్యోదంతం..
దేశంలో బీహర్ అనగానే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పేరుంది. అక్షరాస్యత అంతగాలేని ఆ రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధిలేక అనేకమంది ఇతర రాష్ట్రాల్లో కూలీలుగా వలసలు వెళుతున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా డైయిరీ ఫాంలో పనిచేసేందుకు వస్తుంటారు. అనేకమంది కూలీలు వరంగల్ జిల్లాలోని పలు ప్రైవేట్ డైరీల్లో పనిచేస్తున్నారు.