ప్రతీకాత్మక చిత్రం
అధికార పార్టీకి చెందిన కీలక నేత సిఫారసుతో నియామకం.. మరో వివాదాస్పద ప్రజాప్రతినిధి ప్రోత్సాహం.. ఇక తిరుగేం ఉంటుంది. అందుకే ఆ పోలీస్ అధికారి అన్నింటికీ అతీతుడు. నిబంధనలు పట్టించుకోరు. సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోకూడదన్నా అసలే పట్టదు. అధికార పార్టీ నేతల దందాలకు ఏకపక్షంగా వత్తాసు పలుకుతారు. కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ వేధిస్తారు. ఆయన బదిలీలకూ అతీతమే. కొన్నేళ్లుగా ఎంతోమంది అధికారులు బదిలీ అవుతున్నా.. బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఆయన మాత్రం జిల్లాలోనే కొనసాగుతూ వివాదాస్పదంగా మారారు.
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ పోలీస్ కమిషరేట్‌లో ఓ మధ్యస్థాయి పోలీస్ అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. జిల్లాలో కీలక టీడీపీ నేత అండదండలతో ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నారు. దీంతో ఆయనంటే ఉన్నతాధికారులు హడలిపోతారు. ఇక విజయవాడలో దందాలతో బెంబేలెత్తిస్తున్న ఓ ప్రజాప్రతినిధి అండదండలూ ఆయనకు ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆయన వివాదాస్పదంగా మారుతున్నా అడ్డుకునే వారే లేరు. రెండుసార్లు అధికారులను బదిలీచేసినా ఆయనకు మాత్రం స్థానచలనం లేదు. అసలు ఆయనను బదిలీ చేయాలన్న యోచనకే ఉన్నతాధికారులు సాహసించలేకపోతున్నారని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి.
వివాదాస్పదంగా మారిన ఆ అధికారి వ్యవహారాల్లో కొన్ని ఉదాహరణలు..
- ఇటీవల విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో 20 సెంట్ల ప్రైవేట్ భూమిని టీడీపీ నేతలు ఆక్రమించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం ఖరీదు దాదాపు రూ.2కోట్లు. ఆ స్థల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ, ఆ ఉత్తర్వులను అమలు చేయడానికి ఈ పోలీస్ అధికారి ససేమిరా అన్నారు. అప్పటికే అక్కడ తాత్కాలిక గుడారాలు వేసుకుని ఉన్న అధికార పార్టీ నేతలకు వత్తాసు పలికారు. తమకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కదా అని బాధితులు అనడంతో పోలీస్ అధికారి శివాలెత్తిపోయారు. ఎక్కువగా మాట్లాడితే అంతు చూస్తానని బెదిరించారు. అధికార పార్టీ నేతలు రూ.50 లక్షల వరకు ఇస్తారు. అవి తీసుకుని స్థలాన్ని వదిలేయాలని కూడా అధికారి వారికి చెప్పడంతో బాధితులకు నోట మాట రాలేదు. రూ.2 కోట్ల స్థలాన్ని కేవలం రూ.50 లక్షలకు విక్రయించాలని ఆ అధికారి సెటిల్‌మెంట్ పేరుతో దందా చేయడం విస్మయపరిచింది.
- ఆ పోలీసు అధికారి తన పరిధిలోని కిందిస్థాయి అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లపర్వం కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కిందిస్థాయి సిబ్బంది ప్రధానంగా బంగారు వర్తకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. తరచూ చిన్న బంగారు వర్తకులను అదుపులోకి తీసుకుని రికవరీల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏ దొంగతనం కేసు అన్నది కూడా చెప్పకుండా ఏకపక్షంగా రికవరీలంటూ వసూళ్లకు పాల్పడుతుండటంతో చిరు వర్తకులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతోపాటు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, ఇతర చిన్నచిన్న వ్యాపారులను పెట్టీ కేసుల పేరుతో వేధిస్తున్నారు.
- విజయవాడ శివారులోని గొల్లపూడి– ఇబ్రహీంపట్నం మధ్యలో చాలా ఏళ్ల క్రితం రిటైర్డ్ ఉద్యోగులు, వన్‌టౌన్‌కు చెందిన చిన్న వ్యాపారులు ప్లాట్లు కొన్నారు. కానీ, రాష్ట్ర విభజన తరువాత ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో జిల్లా కీలక నేత అనుచరులు ఆ ప్రాంతంలో ఉన్న అసైన్డ్ భూములతోపాటు ఈ ప్లాట్లను కూడా చదును చేసి లే అవుట్ వేశారు. దాదాపు 30 ప్లాట్ల వరకు అలా కలిపేసుకున్నారు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. పోలీసులను ఆశ్రయించారు. కానీ, ఆ పోలీస్ అధికారి కబ్జాదారులకు అనుకూల వాదన వినిపించారు. ‘వాళ్లంతా పెద్ద వాళ్ల మనుషులు. వారితో గొడవ ఎందుకు..? ఎంతో కొంత తీసుకుని ఆ ప్లాట్లు వదిలేయండి’ అని చెప్పడం గమనార్హం. అందుకు వ్యాపారులు ససేమిరా అనడంతో వారిపై ఆ పోలీస్ అధికారి ఆగ్రహించారు. మాట వినకపోతే వన్‌టౌన్‌లో వ్యాపారాలు చేసుకోలేరని పరోక్షంగా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment