
పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం
♦ షాబాద్ మండలం నాగరగూడలో బాలుడు..
♦ శంషాబాద్ మండలం కవ్వగూడలో మహిళ..
♦ తొండుపల్లిలో రెండు.. ఘాంసిమియాగూడ, నాగిరెడ్డిపల్లిలో
♦ ఒక గేదె, మన్సాన్‌పల్లిలో ఐదు మేకలు మృతి
♦ సిరిగిరిపల్లిలో కోళ్లఫాం కూలి రెండువేల కోళ్లు మృత్యువాత
♦ మహేశ్వరం మండలం సిరిగిరిపురంలో
♦ వర్షానికి కూలిన గోడ.. ఒకరి మృతి
కవ్వగూడ(శంషాబాద్ రూరల్): పిడుగుపాటుతో ఓ మహిళ దుర్మరణం చెందగా.. కూలీకి వచ్చిన మరో యువతి పరిస్థితి విషమంగా ఉంది. శంషాబాద్ మండలంలోని కవ్వగూడలో మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రొడ్డ పెంటయ్య, భార్గవి(28) దంపతులు తమకున్న అరెకరం పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. వీరికి పిల్లలు మణిరాం(5), శ్రీనాథ్(3) ఉన్నారు. పొలంలో బెండకాయ, సొరకాయ, ఆకుకూర సాగు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గొడుగు గోపాల్ కూతురు సంధ్య(19) మంగళవారం వీరి పొలంలోకి కూలీకి వచ్చింది.
భార్గవి, సంధ్య సొరకాయ పంటలో కలుపు తీస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. దీంతో వీరిద్దరూ సమీపంలో ఉన్న ఓ మేడిచెట్టు కిందికి చేరుకున్నారు. అదే సమయంలో పిడుగుపడడంతో భార్గవి, సంధ్య స్పృహ కోల్పోయారు. సమీపంలోని పొలాల్లో ఉన్న వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గ్రామం నుంచి భార్గవి భర్త పెంటయ్య, మాజీ ఎంపీటీసీ మైసయ్యతోపాటు స్థానికులు ఆటోలో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
భార్గవి అప్పటికే మృతి చెందగా.. కొనఊపిరితో ఉన్న సంధ్యను ఆటోలో శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అప్పటి వరకు పొలంలో హుషారుగా పని చేసిన ఆమె దుర్మరణం చెందడంతో భర్త కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.