అదుపు తప్పిన ఆర్టీసీ బస్సులు
-
ఇందిరానగర్ వద్ద కల్వర్టులోకి దూసుకెళ్లిన మెట్‌పల్లి డిపో ఎక్స్‌ప్రెస్
-
23 మందికి గాయాలు
-
డ్రై వర్ పరిస్థితి విషమం
-
దేవక్కపల్లివద్ద పల్టీ కొట్టిన జగిత్యాల డిపో సర్వీస్
తిమ్మాపూర్: జిల్లాలో గురువారం ఉదయం రెండు ఆర్టీసీ బస్సులు అదుపు తప్పాయి. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద ఓ బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లింది. బెజ్జంకి మండలం దేవక్కపల్లి వద్ద మరో బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదాల్లో రెండు బస్సుల డ్రై వర్లు, ప్రయాణికులు గాయపడ్డారు.
మెట్‌పల్లి డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తుండగా తెల్లవారుజామున తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు టైర్లు ఊడిపోయి ఒక్కసారిగా కుదుపునకు గురైంది. దీంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. డ్రై వర్ సారయ్య, కండక్టర్ గోపాల్‌తోపాటు బస్సులో ఉన్న 23మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రై వర్ పరిస్థితి విషమంగా ఉండగా.. తీవ్రంగా గాయపడిన ఎనిమిదిమందికి ఆస్పత్రిలో చేరారు. మిగతావారు ప్రాథమిక చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. ప్రయాణికుల్లో కరీంనగర్, జగిత్యాల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిలో మంచిర్యాలో ఉండే ఒకే కుటుంబానికి చెందిన ఆకుల శ్రీనివాస్, లక్ష్మి, రాంచరణ్, మరోకుటుంబానికి చెందిన లెంకల స్వరూప, ప్రశాంత్, సదానందం, లేబర్ పని కోసం కరీంనగర్‌కు వస్తున్న లక్ష్మి, గోవిందమ్మ, గురుమూర్తి, కరీంనగర్‌కు చెందిన ఎస్.రమేశ్ ఉన్నట్లు వివరించారు. ప్రయాణికుడు సయ్యద్ అన్వర్‌అలీ ఫిర్యాదు మేరకు ఎల్‌ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ట్రాన్స్‌పోర్టు కమిషనర్...
ఆర్టీఏ ఆఫీసులో హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు తిమ్మాపూర్‌కు వస్తున్న రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. ఆర్టీసీ ఆర్‌ఎం చంద్రశేఖర్ సంఘటన స్థలానికి వచ్చారు. పలు డిపోల మేనేజర్లు ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
దేవక్కపల్లి వద్ద బస్సు బోల్తా
బెజ్జంకి: మండలంలోని దేవక్కపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున జగిత్యాల డిపోకు చెందిన బస్సు బోల్తా పడింది. 16 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న బస్సు దేవక్కపల్లి సమీపంలోని కపిల్‌హోమ్స్ వద్దకు రాగానే రాజీవ్ రహదారి నుంచి పక్కకు దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈప్రమాదంలో డ్రై వర్ సమ్మయ్య స్వల్పంగా గాయపడ్డాడు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమీపంలోని టోల్‌ప్లాజా సిబ్బంది ప్రయాణికులను మరో బస్సులు ఎక్కించి కరీంనగర్‌కు పంపించారు. విరేచనాలతో బాధపడుతున్న డ్రై వర్ అలాగే బస్సును నడుపుకుంటూ వస్తుండగా.. దేవక్కపల్లివద్ద కళ్లు తిరగడంతో బస్సు అదుపు తప్పినట్లు తెలిసింది.