ఆదుకోవాల్సిన మేనమామలే....
ఈ అక్కాచెల్లెళ్లను పసిప్రాయంలో విధి పగబట్టింది. ఆరేళ్ల క్రితం అమ్మా నాన్నలు చనిపోతే.. అనాథలయ్యారు. ఇంతకాలం మేనమామల వద్ద ఆశ్రయం పొందిన బాలికలకు ఇప్పుడు అక్కడా ఆదరణ కరువైంది. దీంతో పెద్దపల్లిలో ఉంటున్న పెద్దమ్మ ఇంటికి చేరుకున్నారు. వారికి కూడా భారమవుతున్నామని బాధపడుతున్నారు. ప్రభుత్వం, మానవ తావాదులు స్పందించి ఆదుకుంటే... చక్కగా చదువుకుంటామని వేడుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లా : ‘తల్లిదండ్రులు లేకున్నా.. మేనమామలు ఉంటే చాలు’ అనేది సామెత. కానీ.. ఇది ఓ అనాథలైన అక్కాచెల్లెళ్ల పట్ల తిరగబడింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన వారిని ఆదుకోవాల్సిన మేనమామలు ఇక తమవల్ల కాదంటూ వదిలించుకున్నారు. దీంతో అక్కాచెల్లిళ్లు వీధిన పడ్డారు. ప్రస్తుతం పెద్దనాన్న, పెద్దమ్మ వద్ద ఆశ్రయం పొందుతున్నారు.
పెద్దపల్లికి చెందిన సామ లక్ష్మీకాంతం, మల్లేశం దంపతులకు నాగజ్యోతి, సంధ్యారాణి కూతుళ్లు. ఆరేళ్లక్రితం తల్లిదండ్రులిద్దరూ చనిపోయూరు. ఆ సమయంలో వీరి బాగోగులు చూసుకుంటామంటూ లక్ష్మీకాంతం సోదరులు హామీ ఇచ్చారు. లక్ష్మీకాంతానికి చెందిన బంగారు ఆభరణాలు, ఇతరత్రా డబ్బును తీసుకెళ్లారు. ఓ మామ హైదరాబాద్‌లో.. మరొకరు గోదావరిఖనిలో ఉంటున్నారు. నాగజ్యోతిని ఒకరు.. సంధ్యారాణిని మరొకరు తీసుకెళ్లారు.
అప్పటినుంచి తమను పనిమనుషుల్లాగే చూశారని, ఎప్పుడో ఒకసారి బడికి పంపేవారని, వారి పిల్లలను ఆడించేందుకే అధిక సమయం వెచ్చించేవారమని ఈ అక్కాచెల్లెళ్లు తెలిపారు. తీరా నాలుగు నెలల క్రితం ఇద్దరినీ ఇంటి నుంచి వెళ్లగొట్టారు. కరీంనగర్‌లో ఇంటర్ పూర్తి చేసిన న్యాగజ్యోతికి ఫీజు పూర్తిగా చెల్లించకపోవడంతో యాజమాన్యం సర్టిఫికెట్ల ఇవ్వలేదు. ఈ విషయం తన మామతో చెబితే పైచదువులు వద్దంటూ ఎంసెట్ కోసం తెచ్చిన దరఖాస్తు ఫామ్ చింపేశాడని నాగజ్యోతి కన్నీటిపర్యంతమంది.
పుస్తకాలతో తమ పెద్దనాన్న సామ తిరుపతి, పెద్దమ్మ పద్మ వద్దకు చేరామని పేర్కొన్నారు. తాను తొమ్మిదో తరగతిలోనే చదువు మానేశానని, తన చెల్లికైనా సహాయం చేస్తే చదువుకుని బాగుపడుతుందని సంధ్యారాణి కోరుతోంది. దాతలు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటోంది.