రెండేళ్ల విధ్వంస పాలన
అంతా దగా.. విలువల హననం
అటకెక్కిన బాబు హామీలు ఎటుచూసినా స్కాములు రైతన్నల పరిస్థితి దైన్యం అక్కచెల్లెమ్మలకు శోకం నిరుద్యోగులకు శఠగోపం లక్షన్నర కోట్ల అవినీతి ప్రజాస్వామ్యానికి పాతర వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
ఏ ఏడాది చూసినా ఏమున్నది గర్వకారణం...? నారావారి చరిత్ర సమస్తం.. వంచన.. దగా.. విలువల హననం.. అవినీతి పరాయణత్వం.. పాలనా విధ్వంసం..!!
రెండేళ్లు గడచిపోయాయి. అలవికాని హామీలను అలవోకగా గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రెండేళ్లలో హామీలన్నిటినీ అటకెక్కించి అన్ని వర్గాలనూ మోసం చేశారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, వారి బినామీలు విచ్చలవిడి అవినీతి - అంతేలేని కుంభకోణాలతో లక్షన్నరకోట్లకు పైగా దోచుకున్నారు. ఇది పైకి కనిపిస్తున్నది మాత్రమే. తేలాల్సిన ‘లెక్క’ ఇంకా చాలానే ఉంది. ఇలా అక్రమంగా ఆర్జించిన అవినీతి డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఎరవేస్తూ స్వయంగా ముఖ్యమంత్రే నిస్సిగ్గుగా కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు. సీఎంగా చంద్రబాబునాయుడు పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వ్యవస్థల విధ్వంసాన్ని పరిశీలిద్దాం...
హామీలు హుళక్కే
మేనిఫెస్టోలో ఇచ్చిన 600 హామీలను చంద్రబాబు అటకెక్కించేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, బడుగులకు ఇళ్లు వంటి ముఖ్యమైన హామీల విషయంలోనూ దారుణంగా వంచించారు. అట్టహాసంగా ప్రమాణ స్వీకార సభలో చేసిన సంతకాలకు విలువే లేకుండా పోయింది.
సంక్షోభంలోకి వ్యవసాయం
బాబు సీఎం అయ్యేనాటికి రైతుల రుణాలు రూ. 87,612 కోట్లు ఉన్నాయి. వాటికి 14శాతంతో చెల్లించాల్సిన వడ్డీయే రూ. 24,531 కోట్లు అయ్యింది. అంటే మొత్తం రైతు రుణాలు రూ. 1,12,143 కోట్లు అయ్యాయి. మూడు బడ్జెట్లలో రుణమాఫీకి ఇచ్చింది రూ. 7,400 కోట్లే. అంటే వడ్డీలో మూడో వంతు కూడా లేదన్నమాట. మరి రైతుల రుణాలు మాఫీ అయ్యేదెన్నడు? చంద్రబాబు చేసిన మోసానికి రైతులు ఫలితం అనుభవిస్తున్నారు. బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పుట్టక, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ వాటిని తిరిగి కట్టే దారిలేక ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు.
డ్వాక్రా వ్యవస్థ విధ్వంసం
చంద్రబాబు పగ్గాలు చేపట్టేనాటికి డ్వాక్రా సంఘాల రుణాలు రూ. 14,204 కోట్లు. దీనిపై రెండేళ్లలో అయిన వడ్డీ రూ. 5,000 కోట్లు. పెట్టుబడి నిధి పేరిట ఇప్పటికి చెల్లించింది రూ. 2,423 కోట్లు. డ్వాక్రా మహిళలు చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి నిలువునా మోసపోయారు. బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మిగిలారు. దీంతో అనేక డ్వాక్రా సంఘాలు పనిచేయడం ఆగిపోయింది.
నిరుద్యోగుల ఖేదం
ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం కల్పించేలోగా నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి కల్పిస్తామన్న చంద్రబాబు ఇపుడా ఊసే ఎత్తడం లేదు. రెండేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. భవిష్యత్ ఏమిటో అర్ధం కాక నిరుద్యోగులు నిరాశానిస్పృహలో ఉన్నారు.
వైద్యవ్యవస్థ చిన్నాభిన్నం
పేదలందరికీ ఉచితవైద్యం అందించే ఆరోగ్యశ్రీ పేరు మార్చి హడావిడిచేసినా అమలు చేయకుండా నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీతోపాటు 104, 108 సర్వీసులూ అటకెక్కాయి. ప్రభుత్వ వైద్యశాలలు, సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వాధినేతగా కాకుండా కార్పొరేట్ సంస్థకు సీఈవోనని మరోసారి నిరూపించుకున్నారు.
విద్యారంగం అస్తవ్యస్తం
19 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ ఊసులేదు. హేతుబద్ధీకరణ పేరుతో 1,500 పాఠశాలలు మూతవేశారు. మొత్తం 9వేల పాఠశాలలు మూతపడబోతున్నాయి.
తండ్రీకొడుకుల అవినీతే ప్రగతి
ఈ రెండేళ్లలో బాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏదైనా ఉందంటే అది అవినీతిలోనే. ఇసుక నుంచి మద్యం వరకు అవినీతిని ఏరులుగా పారిస్తున్నారు. పట్టిసీమ నుంచి సదావర్తి సత్రం భూముల వరకు కుంభకోణాలకు అంతేలేదు. ఈ రెండేళ్లలో చంద్రబాబు, ఆయన కుమారుడు, బినామీలు సాగించిన అవినీతి - కుంభకోణాల విలువ రూ. 1,45,549 కోట్లకు చేరుకుందని ఆధారసహిత గణాంకాలు చెబుతున్నాయి.
రాజధాని పేరుతో అవినీతి
రాజధాని నిర్మాణం పేరుతో అంతర్జాతీయ కుంభకోణానికి తెరతీశారు. అధికార రహస్యాలను కాపాడతానన్న ప్రమాణాన్ని తుంగలో తొక్కి ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’కు పాల్పడడం ద్వారా రాజధాని ఎంపిక సమయంలోనే దాదాపు లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. భూ యజమానులకు మేలుకలిగే భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి బలవంతపు భూసేకరణకు దిగుతోంది. వాటిని ఆశ్రీతులకు, కమీషన్లిచ్చే కంపెనీలకు కారుచౌకగా కట్టబెడుతున్నారు. పరిశ్రమలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలకూ రాజ ధాని తరహాలో భూ సమీకరణ లేదా సంప్రదింపుల ద్వారా నామమాత్రపు పరిహారంతో భూ సేకరణ విధానం తెచ్చేందుకు సర్కారు కుటిల మంత్రాంగం చేస్తోంది. భోగాపురంలో నిర్వాసితులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. రాజధాని కూడా లేని పేద రాష్ట్రంలో విరాళాలు సేకరిస్తూనే దాదాపు వెయ్యికోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కార్యాలయాల సోకులకు, ప్రత్యేక విమాన ప్రయాణాలకు, శంకుస్థాపనలకు, సభలకు, ఆడంబర పర్యటనలకు చంద్రబాబు చేస్తున్న దుబారా చూసి జాతీయ మీడియాతో పాటు కేంద్రమూ ఆశ్చర్యపోయింది.
ఫిరాయింపుల చట్టానికి చెల్లుచీటి
అడ్డదారుల్లో అడ్డగోలుగా ఆర్జించిన అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్య విలువలకు పాతరేయడమే ఈ రెండేళ్లలో సాధించిన ముఖ్యమైన ఘనత. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలకు పదవులు, కోట్లాది సొమ్ములు, కాంట్రాక్టులు ఎరవేసి కొనుగోళ్లు చేయడం, ఆ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రే పాల్గొనడం దేశంలో మరెక్కడా చూడం. ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన చేస్తూ.. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలన్న కక్షపూరిత ధోరణితో కుట్రలకు దిగజారడం చంద్రబాబు మార్కు దిగజారుడుతనానికి నిదర్శనం. ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వరకు కుమ్మరించిన చంద్రబాబు మొత్తం 19 మంది ఎమ్మెల్యేలకు రూ.600 కోట్ల వరకు వెచ్చించారు. ఏపీలోనే కాదు అంతకుముందు తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు లంచమిస్తూ ససాక్ష్యంగా దొరికిపోయారు. ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా బుక్కయ్యారు.
రాష్ర్టప్రయోజనాలకు సమాధి
సొంత రాష్ర్టంలో అవినీతి, కుంభకోణాలు, పొరుగు రాష్ర్టంలో ‘ఓటుకు కోట్లు’ కేసు వల్లే ప్రత్యేక హోదా, ప్రాజెక్టుల విషయంపై చంద్రబాబు అటు కేంద్రప్రభుత్వంతోనూ, ఇటు కేసీఆర్ ప్రభుత్వంతోనూ కొట్లాడలేకపోతున్నారు. అలా తన స్వార్ధం కోసం రాష్ర్ట ప్రజల భవితవ్యాన్ని పణంగా పెట్టారు.
పరిపాలనా విధ్వంసం
ప్రజాసంక్షేమమే పరమావధిగా ఏర్పాటైన వ్యవస్థలను, విధానాలను విధ్వసం చేసిన చంద్రబాబు దోపిడీయే పరమావధిగా కొంగొత్త విధానాలను తెరపైకి తెచ్చారు. జన్మభూమి కమిటీలపేరుతో ప్రజాస్వామ్యాన్ని, స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలను ఖూనీ చేశారు. అధికారంలోకి రాగానే విద్యుత్తు చార్జీలు, బస్సు చార్జీలు, స్థిరాస్తి విలువల పెంపు.. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ పెంపు ద్వారా ప్రజలపై ఏటా పడుతున్న అదనపు భారం రూ. 3,300 కోట్లుపైమాటే. పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ. 4 అదనంగా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) బాదడంవల్ల ప్రజలపై ఏటా ప్రత్యక్షంగా, పరోక్షంగా పడుతున్న అదనపు భారం రూ. 2,260 కోట్లు దీనికి అదనం. వివిధ సేవలకు సర్వీస్ ఛార్జీలు, ఖనిజాలపై రాయల్టీ, డెడ్ రెంట్ పెంపు వాటి ద్వారా పడే భారమంతా కలుపుకుంటే ఈ మొత్తం చాలా పెరుగుతుంది.
రెండేళ్లుగా స్తబ్ధత
కేసుల భయంతో సీఎం విజయవాడలో.. ఉద్యోగులు హైదరాబాద్‌లో.. రెండేళ్లుగా ఇదీ పరిస్థితి. అందుకే రెండేళ్లుగా పరిపాలనలో పూర్తి స్తబ్ధత, నిస్తేజం నెలకొంది. ఇపుడు రాజధానిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా పూర్తికాకుండానే బలవంతంగా తరలిస్తుండడం, అక్కడ అద్దెలు తారస్థాయిలో ఉన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడం వంటి సమస్యలతో ఉద్యోగులు సతమతమవుతున్నారు.