సాహసమే ఊపిరి.. గిన్నిస్ బుక్‌పై గురి
అణువణువునా తొణికిసలాడే సాహసానికి సాధన తోడైతే.. కొండల్ని ఢీకొనవచ్చు. మబ్బుల్ని మథించే ఎత్తుకు ఎగరవచ్చు. వీసమెత్తు పొరపాటు జరిగినా ప్రాణాలు గాలిలో కలిసే విన్యాసాలను అలవోకగా చెయ్యవచ్చు. దీన్ని నమ్మిన వాడే రాజమహేంద్రవరానికి చెందిన కొమ్మ ఉజ్వల్. 21వ డివిజన్ ఉల్లితోటకు చెందిన 23 ఏళ్ల ఈ యువకుడు.. నీటిలో చేప ఈదినంత సులువుగా నేలపైనా, గాలిలోనూ సాహసకృత్యాలు చేస్తున్నాడు
-
సాధనతో అద్భుతాలు సృష్టిస్తున్న ఉజ్వల్
-
చిరుప్రాయం నుంచే మార్షల్ ఆర్ట్స్‌లో పాటవం
-
గాలిలో, నేలపై అపూర్వ విన్యాసాలు
-
పలు పోటీల్లో బహుమతులు, పతకాలు
రాజమహేంద్రవరం సిటీ :
అణువణువునా తొణికిసలాడే సాహసానికి సాధన తోడైతే.. కొండల్ని ఢీకొనవచ్చు. మబ్బుల్ని మథించే ఎత్తుకు ఎగరవచ్చు. వీసమెత్తు పొరపాటు జరిగినా ప్రాణాలు గాలిలో కలిసే విన్యాసాలను అలవోకగా చెయ్యవచ్చు. దీన్ని నమ్మిన వాడే రాజమహేంద్రవరానికి చెందిన కొమ్మ ఉజ్వల్. 21వ డివిజన్ ఉల్లితోటకు చెందిన 23 ఏళ్ల ఈ యువకుడు.. నీటిలో చేప ఈదినంత సులువుగా నేలపైనా, గాలిలోనూ సాహసకృత్యాలు చేస్తున్నాడు. తాజాగా ఆదివారం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించేందుకు నగరంలో 250 కేజీల బరువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ రైడర్‌తో కలిపి తన పొట్ట మీదుగా వెళ్లే సాహసాన్ని చేసి చూపాడు. అలా.. ఒకటికాదు, రెండు కాదు.. 100 ఎన్‌ఫీల్డ్‌ల పయనానికి ఉజ్వల్ తన ఉదరాన్ని వేదిక చేశాడు.
ప్రత్యేకత కోసం తపనే ప్రేరణ
3వ తరగతి నుంచే కరాటే, కుంగ్‌ఫూ, బాక్సింగ్ క్రీడల్లో ఆరితేరిన ఉజ్వల్ తన కంటూ ప్రత్యేకత ఉండాలని తపించే వాడని, ఈ తపనే కుమారుడిని గిన్నిస్ బుక్ రికార్డు సాధన దిశగా ప్రేరణనిచ్చిందని తండ్రి శ్రీనివాసరావు ఉత్సాహంగా చెబుతారు. కిక్ బాక్సింగ్, కరాటే, కుంగ్‌ఫూలలో ఉజ్వల్ ఇప్పటికే అనేక బంగారు పతకాలు, బహుమతులు అందుకున్నాడు. హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్ నిర్వహించిన పోటీల్లో మొదటి బహుమతి సాధించి, హీరో మహేష్‌బాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. కిక్ బాక్సింగ్‌లో గాలిలో తేలి కాలితో పెంకులు పగులకొట్టడం, పొట్టపై మోటారు సైకిళ్లను ఎక్కించుకోవడం, ఫైర్ బ్లోయింగ్(గాలిలో మంటలు ఊదడం).. ఇలా అనేక విన్యాసాలు చేసి అబ్బురపరిచి అనేక బహుమతులు అందుకున్నాడు.
2001 హైదరాబాద్ లో జరిగిన ఇంటర్‌నేషన్ బుడేకాన్ కరాటే పోటీలో 7వ స్థానం , 2002లో ఏపీ ఇన్విటేషనల్ కరాటే చాంపియన్ షిప్‌లో మూడవ స్థానం, 2005లో రాష్ట్ర కరాటే, కుంగ్‌ఫూ పోటీల ఆరెంజ్ బెల్ట్ విభాగంలో మొదటి బహుమతి, 2006లో బుడేకాన్ పోటీల్లో 6వ స్థానం, ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా జరిగిన పోటీలలో ద్వితీయ బహుమతి, 2007లో రాష్ట్రస్థాయి న్యూడ్రాగన్ చైనీస్ కుంగ్‌ఫూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీల్లో మొదటి స్థానం, 2012 విశాఖపట్నంలో జరిగిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో బంగారుపతకం, 2013, 15 సంవత్సరాల్లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో బహుమతులు, 2014 లో రాష్ట్ర కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్‌తో పాటు బంగారు పతకం సాధించాడు. 2015లో పొట్టపై నుంచి 20 మోటారుసైకిళ్లను ఎక్కించుకుని పారగాన్ యూత్ ఐకాన్ టైటిల్ సాధించాడు. చారిత్రకనగరానికి చెందిన ఈ యువ కిశోరం.. సాహసాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించే దిశగా దూసుకుపోతున్నాడు.