
బతికున్నవాళ్లను కూడా శవాలనుకుని వదిలేశారు
గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగిన తర్వాత.. బతికున్న వాళ్లను కూడా శవాలనుకుని వదిలేశారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. సాధారణంగా ఎక్కడైనా ఐదారు నిమిషాల్లోనే తొక్కిసలాట కంట్రోల్ అవుతుందని, ఇక్కడ మాత్రం గంటన్నర పాటు జరిగిందని ఆయన అన్నారు. శవాలు అనుకుని కింద పడేసిన వాళ్లలో ఒక ముసలావిడకు మంచినీళ్లు పట్టిస్తే.. ఆమె బతికిందని ఉండవల్లి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
- కనీస అవసరాలు వదిలిపెట్టి.. లగ్జరీలకు ప్రాధాన్యం ఇచ్చారు
- ఇక్కడకు పుణ్యం వస్తుందని వచ్చారు.. వాళ్లు సినిమా టికెట్ల కోసం వెళ్లినవాళ్లు కారు
- ఒక్కసారి లాఠీ చూపిస్తే చాలు.. వెంటనే ఆగుతారు
- పోలీసులు చేతులు ఎత్తేయడం వల్లే ఇలా అయ్యింది.
- వీఐపీ వెళ్లిపోయాడని అంతా వదిలేయడం వల్లే ప్రమాదం జరిగింది
- చుట్టాలింటికి వచ్చాం, మా వాళ్లు చచ్చిపోయారని ఒకావిడ చెబుతుంటే చాలా బాధ అనిపించింది.
- ఏ జబ్బూ లేదు.. రాజమండ్రి పుష్కరాల్లో తొక్కేసి చంపేశారన్నారు
- ఇలా జరిగినందుకు రాజమండ్రి వాసులుగా చాలా బాధపడుతున్నాం
- ఎన్నో పుష్కరాలు చూశాం.. ఎప్పుడూ ఇన్ని చావులు చూడలేదు
- దీనికి ఎవరు బాధ్యులో ఆ భగవంతుడికే తెలియాలి
- చనిపోయినవాళ్ల వారసులు మాత్రం తరతరాల పాటు గోదావరి వద్ద తొక్కి చంపేశారని చెప్పుకొంటారు.
- పుష్కరాల రేవు దగ్గర ఫస్ట్ ఎయిడ్ అన్నారు గానీ.. అక్కడేమీ లేవు.
- ప్లాస్టిక్ నిషేధించాం అనడంతో.. ఎవరూ కనీసం నీళ్లు కూడా తెచ్చుకోలేదు
- లేకపోతే.. ప్రతివాళ్లూ ఒక వాటర్ బాటిల్ తెచ్చుకునేవాళ్లు. ఆ నీళ్లు తాగించినా బతికేవాళ్లేమో!