
ఆ పండ్లు తింటే రోగాలే!
దేశంలో తినడానికి అందుబాటులో ఉన్న పండ్లలో కేవలం 40 శాతం మాత్రమే తాజావని, మిగిలిన వాటితో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఫుడ్ టెక్నాలజీ డివిజన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.గౌతమ్ విశ్లేషించారు.
మన దేశంలో 40 శాతం పండ్లే తాజావి: ప్రొఫెసర్ గౌతమ్
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలో తినడానికి అందుబాటులో ఉన్న పండ్లలో కేవలం 40 శాతం మాత్రమే తాజావని, మిగిలిన వాటితో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఫుడ్ టెక్నాలజీ డివిజన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.గౌతమ్ విశ్లేషించారు. ఇప్పటికీ మన దేశంలోని మామిడి ఉత్పత్తులను మార్కెట్ చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం, గోధుమలతో సహా అనేక తృణ ధాన్యాల్లో ప్రమాదకర పురుగులు ఉంటున్నాయని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల మాదిరి భారత్‌లోనూ ఆహార శుద్ధి కేంద్రాలను నెలకొల్పితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదన్నారు. 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు వచ్చిన ఆయన గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
విషాహారం తింటున్నాం!
వరి ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. గోధుమ ఉత్పత్తిలో చైనా తర్వాత స్థానం మనదే. సుగంధ ద్రవ్యాల వాడకంలో మన దేశమే నంబర్ వన్. ఏటా 21 మెట్రిక్ టన్నుల గోధుమలను రొట్టెల కోసం వాడుతున్నారు. ఇందులో 60 శాతం ఆహార శుద్ధి లేకపోవడం వల్ల చెడిపోతున్నాయి. చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ సమస్యల బారిన పడటానికి ఇది కూడా ఓ ముఖ్య కారణం. ఏటా కనీసం 20 కోట్ల మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఎగుమతుల్లో మన స్థానం ఏది?
మన మామిడి పండుకు అమెరికాలో మంచి గిరాకీ ఉంది. అయినా ఆహారశుద్ధిపై దృష్టి పెట్టకపోవడం వల్ల నాణ్యత ప్రమాణాలు లేవని తిరస్కరిస్తున్నారు. 2007లో 157 మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తులను ఎగుమతి చేస్తే.. 2016 నాటికి ఇది 750 మెట్రిక్ టన్నులకే పెరిగింది. దేశంలో ఉత్పత్తి అయ్యే మామిడిలో ఇది కేవలం రెండు శాతం మాత్రమే. ఇక శుద్ధి చేసే అవకాశం లేకపోవడం వల్ల టన్నుల కొద్ది వృథా అవుతున్నాయి.
ఎవరూ అడ్డుకోవడం లేదు..
చెట్లపై పండాల్సిన వివిధ రకాల ఫలాలను పచ్చిగా ఉన్నప్పుడే కోస్తున్నారు. ప్రమాదకరమైన రసాయనాలు వాడి వాటిని ఆకర్షించేలా కృతిమ విధానంలో పండిస్తున్నారు. ప్రతీ ఏటా కనీసం 24 లక్షల మెట్రిక్ టన్నులు ఈ విధంగానే ప్రజల వద్దకు వెళ్తున్నాయి. ఫలితంగా ఏటా 18 కోట్ల మంది రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. ఇది చట్ట విరుద్ధమని, ఆహార భద్రత నిబంధనలకు వ్యతిరేకమనీ తెలిసినప్పటికీ ఎవరూ అడ్డుకోవడం లేదు.
ప్రైవేటు లేబొరేటరీలే ఎక్కువ
దేశంలో మొత్తం ఆహార శుద్ధి కేంద్రాలు 13 ఉంటే.. అందులో 11 ప్రైవేటు సెక్టార్‌లోనే ఉన్నాయి. దీన్నిబట్టి ఆహారశుద్ధిపై ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉంటుందనేది అర్థమవుతుంది. ఇప్పుడున్న ఈ కేంద్రాలతో మన ఆహార ఉత్పత్తులను రక్షించుకోలేం. తాజా కూరగాయలు, ఫలాలను ప్రజలు అందించలేరు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఒక్కో ఆహారశుద్ధి కేంద్రాన్ని స్థాపించాలంటే కనీసం రూ. 12 కోట్లు ఖర్చవుతుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం సెక్టార్‌లో వీటిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది.