సమష్టి కృషితోనే విజయం
కలెక్టర్ కాంతిలాల్ దండే
గుంటూరు వెస్ట్ : సమష్టి కృషితోనే విజయాలు సాధ్యమని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడం అభినందనీయమని ఆయన చెప్పారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరిన్ని లక్ష్యాలు సాధించాలని కోరారు. జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించిన సిబ్బందికి విజయోత్సవ అభినందన సభ స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం నిర్వహించారు. కలెక్టర్ కాంతిలాల్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పించినట్లు చెప్పారు. పారిశుధ్య నిర్వహణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిన పంచాయతీశాఖ పనితీరును కొనియాడారు.
మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలను సాధించాలి..
అక్టోబర్ 2వ తేదీ నాటికి జిల్లాలోని 462 గ్రామాల్లో 25 వేల మరుగుదొడ్లు నిర్మించాలని కలెక్టర్ కోరారు. ఆయా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం పుష్కర విధులు నిర్వహించిన ఈఓపీఆర్‌డీలు, పంచాయతీ సెక్రటరీలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. తొలుత ఇటీవల మృతిచెందిన కొల్లూరు ఈవోపీఆర్‌డీ మల్లీశ్వరి మృతికి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ కె.శ్రీదేవి, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్లు్యఎస్ ఎస్‌ఈ పి.భానువీరప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ షేక్ హబీబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.