గుర్తు తెలియని మహిళ అగ్నికి ఆహుతి
గుర్తు తెలియని మహిళ అగ్నికి ఆహుతి
Published Fri, Mar 3 2017 11:52 PM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM
బొమ్మూరు డంపింగ్‌యార్డులో చోటుచేసుకున్న సంఘటన
హత్యగా పోలీసులు కేసు నమోదు
రాజమహేంద్రవరం రూరల్ : బొమ్మూరు డంపింగ్ యార్డులో గుర్తు తెలియని మహిళ మృతదేహం అగ్నికి ఆహుతైన సంఘటన శుక్రవారం సంచలనం కలిగించింది. సుమారు 40 ఏళ్ల వయస్సు కలిగిన మహిళ పాదాలు మినహా పూర్తిగా సజీవ దహనం కావడంతో గుర్తుపట్టని పరిస్థితి నెలకొంది. ఆ మహిళను ఎవరైనా హత్యచేసి తీసుకువచ్చి కాల్చివేశారా, లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా అన్న విషయం పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. బొమ్మూరు సుద్దకొండ వద్ద ఉన్న డంపింగ్ యార్డు వద్దకు మోషే అనే తొమ్మిదో రగతి విద్యార్థి బహిర్భూమికి వెళ్లాడు. అక్కడ కాలుతున్న మృతదేహాన్ని చూసి, స్థానికులకు, మాజీ సర్పంచ్ మత్సేటి ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లాడు. విషయం తెలుసుకున్న బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కనకారావు, ఎస్సై నాగబాబులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పాదాలు మినహా పూర్తిగా మృతదేహం కాలిపోయింది. ఆమె చేతికి ఉన్న గాజులు ఆధారంగా మహిళగా గుర్తించారు.అర్బన్ జిల్లా అడ్మిన్ ఏఎస్పీ రజనీకాంత్‌రెడ్డి, తూర్పు మండల డిఎస్పీ రమేష్‌బాబులు మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
మహిళను ఎవరైనా హత్య చేసి నిర్జీవ ప్రదేశం అవడంతో ఇక్కడకు తీసుకువచ్చి కాల్చి పడేశారా అన్న కోణాలలో పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్‌టీమ్‌ను తీసుకువచ్చిన ఆధారాలు సేకరించేందుకు అనువుగా లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు మాట్లాడుతూ మృతురాలు ఎవరనేది గుర్తించి, హత్యకు గల కారణాలపై దృష్టి సారించి కేసు దర్యాప్తు చేపడతామని తెలిపారు. బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ కనకారావు మాట్లాడుతూ వీఆర్‌వో నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
బొమ్మూరులో సంచలనం
బొమ్మూరు గ్రామంలో తెల్లవారక ముందే మహిళ మృతి చెందిన విషయం వ్యాపించడంతో గ్రామస్తులతో పాటు వాహనచోదకులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. గుర్తు తెలియని మహిళ హత్య పోలీసులకు సవాల్‌గా మారనుంది. గత ఏడాది అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయం వెనుక హత్యకు గురైన దుళ్ల గ్రామానికి చెందిన యలమర్తి వెంకటేష్ (24) కేసును ఇప్పటివరకు పోలీసులు చేధించలేకపోయారు. మృతదేహం ఆచూకీ తెలిసిన కేసును ఇప్పటివరకు చేధించలేని పోలీసులు ఈ కేసును ఏవిధంగా చేధిస్తారన్న అనుమానం ప్రజల్లో ఉంది.
Advertisement
Advertisement