అడవిలో అలజడి
అడవిలో అలజడి
Published Thu, May 25 2017 12:20 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలను విస్తృ తం చేశారు. గ్రేహౌండ్స్, జిల్లా స్పెషల్ పార్టీ, ఏపీఎస్పీ బలగాలు బృందాలుగా విడిపోయి అన్నల జాడ కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లోని అటవీ ప్రాంతంలో ఈ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. నక్సల్బరీ ఉద్యమం
మొదలై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిం చేందుకు మావోయిస్టులు నిర్ణయించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వారోత్సవాలను కచ్చితంగా జరపాలని మావో యిస్ట్ కేంద్ర, రాష్ట్ర కమిటీల నుంచి ఆదేశాలు అందడంతో ఆ పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ఛత్తీస్‌గడ్ వైపు నుంచి, అటు తూర్పు, విశాఖ జిల్లాల నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతం మీదుగా మావోయిస్టులు సంచరించే అవకాశం ఉన్నందున పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నక్సల్బరీ ఉద్యమం 50 ఏళ్ల ప్రస్థానం నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉత్సవాలు జరపాలంటూ ఇటు తూర్పు గోదావరి జిల్లా చిం తూరు, అటు ఖమ్మం జిల్లా భద్రాచలంలో మావోయిస్ట్ పార్టీ నేతలు ఇప్పటికే పోస్టర్లు వేశారు. ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో ఇటీవల వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటోంది. ఛత్తీస్‌గఢ్, ఖమ్మం జిల్లా సరిహద్దుతోపాటు ఇటు విశాఖ జిల్లా ఏఓబీ సరిహద్దులో ఎన్‌కౌంటర్లు జరగటం.. తూర్పుగోదావరి జిల్లాల్లో మావోయిస్టులు వివిధ ఘటనలకు పాల్పడిన నేపథ్యంలో పోలీసులు వారిని ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ భద్రత విషయంలోనూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అక్కడ గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఇదిలావుంటే.. నక్సల్బరీ ఉద్యమ వారోత్సవాల నేపథ్యంలో రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
మావోయిస్ట్ పార్టీలోకి చంద్రన్న వర్గం!
ఇదిలావుంటే మొన్నటివరకు ‘పశ్చిమ’ ఏజెన్సీలో సంచరిం చిన న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లిన నేపథ్యంలో ఆ వర్గం మావోయిస్ట్ పార్టీలో విలీనం కాబోతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌లో చంద్రన్న వర్గానికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపన్న మావోయిస్ట్ నేతలతో చర్చలు జరిపినట్టు ఇప్పటికే ప్రకటించారు. దీంతో చంద్రన్న వర్గం మావోయిస్ట్ పార్టీలో విలీనం కాబోతోందనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. అంతేకాకుండా చంద్రన్న వర్గం సైతం నక్సల్బరీ వారోత్సవాల్లో పాల్గొంటోంది. మరోవైపు తెలంగాణ మావోయిస్ట్ కమిటీ పాపికొండల్లో దళాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఖమ్మం, కృష్ణా జిల్లాల సరిహద్దులోనూ దళాలను నెలకొల్పేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాల్లో పార్టీ కమిటీలను నియమించనున్నట్టు చెబుతున్నారు. మరోవైపు గతంలో న్యూడెమోక్రసీ, జనశక్తి పార్టీల్లో అంకిత భావంతో పనిచేసిన వారిని సైతం తమ పార్టీలోకి ఆహ్వానించాలని మావోయిస్టులు నిర్ణయించినట్టు భోగట్టా. ఇదిలావుంటే జనశక్తి రాజన్న వర్గం కోస్తా జిల్లాల్లో పుంజుకోవడం పోలీసు వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇటీవల రాజన్న బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లో రహస్యంగా పర్యటించి నట్టు తెలుస్తోంది. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ భద్రత, మరోవైపు నక్సల్బరీ ఉద్యమం వారోత్సవాలు, ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో జిల్లా పోలీస్ ప్రత్యేక బలగాలు అడవిని జల్లెడ పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పోలవరంలో భారీ భద్రత
పోలవరం : మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో భారీభద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏపీ ఎస్పీకి చెందిన 70 మంది, గ్రేహౌండ్స్‌కు చెందిన 30 మంది పోలీసులు ప్రాజెక్ట్ ప్రాంతానికి భద్రత కల్పిస్తున్నారు. గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాజెక్ట్ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ప్రాజెక్ట్ ప్రాంతంలో 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 800 మంది పోలీసుల్ని అదనంగా తీసుకు రావాలని ప్రతిపాదన చేశారు. ప్రాజెక్ట్ వద్ద భద్రత ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులు తమ శాఖకు చెందిన ఒక ఉద్యోగికి రివాల్వర్ ఇచ్చి అక్కడకు పంపినట్టు సమాచారం. ఆ ఉద్యోగి రివాల్వర్‌తో ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో తిరిగినా కాంట్రాక్ట్ ఏజెన్సీ భద్రతా విభాగం, అక్కడి అధికారులు పట్టించుకోలేదని సమాచారం.
Advertisement
Advertisement