ఎమ్మెల్యే వంశీ చందర్‌రెడ్డిని పరామర్శిస్తున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి..
పంజగుట్ట: మహబూబ్ నగర్ జిల్లా కల్వకరుర్తిని రెవెన్యు డివిజన్ చేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసిన ఎమ్మెల్యే వంశీ చందర్‌రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేసి నిమ్స్‌కు తరలించారు. నిమ్స్ మిలీనియం బ్లాక్‌లో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనను శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ చిన్నారెడ్డి, ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తదితరులు పరామర్శించారు.
వంశీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేసేవరకు తన పోరాటం ఆగదని, బలవంతంగా దీక్ష విరమింప జేసినంత మాత్రాన తమ ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా వంశీ పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ్‌కువూర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి కాని.. రైతుల రుణమాఫీకి మాత్రం డబ్బులు ఉండవని ఎద్దేవాచేశారు. రుణమాఫీ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఈ నెలాఖరులో గాంధీ భవన్ ఆవరణలో దీక్ష చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.