వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చాలి
వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చాలి
Published Fri, Sep 2 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
తమ కులాన్ని ఎస్టీల్లో చేర్చాలని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వల్లెపు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లో వెనుకబడిన వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చాలని మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి కోరుతున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చొరవ తీసుకుని తమ సంచార జాతులను ఎస్టీల్లో చేర్చాలని ఆయన కోరారు. అలాగే క్వారీ లీజుల్లో ప్రభుత్వం 50 శాతం వడ్డెర్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్డెర విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, వడ్డెర్ల ఆర్థిక అభివృద్ధికి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు వర్కుల్లో ఈఎండీ లేకుండా రూ. 5 కోట్ల వరకూ వడ్డెర్లకు ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై వడ్డెర్లలో అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తాను పర్యటిస్తున్నట్టు నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికి 12 జిల్లాల్లో తన పర్యటన పూర్తయిందన్నారు. నెల్లాళ్లలో తమను ఎస్టీల్లో చేర్చాలని, లేకుంటే విజయవాడలో రోడ్లపై వంటా వార్పు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. జాతీయ యూత్ అధ్యక్షుడు మల్లె ఈశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు వేముల సత్యనారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల చిన్నా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాంబాబు ఆయన వెంట ఉన్నారు.
Advertisement