పల్లె నుంచి వలసతో విపరిణామాలు
పల్లె నుంచి వలసతో విపరిణామాలు
Published Wed, Jul 27 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
గ్రామ వికాసమే దేశ వికాసం : సీతారాంజీ ∙
జిల్లాలో ప్రవేశించిన భారత పరిక్రమ పాదయాత్ర
తుని రూరల్ :
గ్రామీణులు పట్టణాలకు వలస పోతున్నందు వల్ల పెక్కు విపరిణామాలు సంభవిస్తున్నాయని పూజ్య సీతారాంజీ ఆవేదన వ్యక్తం చేశారు. వలసలతో గ్రామ జీవనం, భూమి, నీరు, అడవులు, ప్రాణులు, ప్రకృతి, గ్రామీణ సంస్కృతులు అస్తవ్యస్తమవుతున్నాయన్నారు. దేశం అభివృద్ధి సాధించాలంటే గ్రామ జీవనం సురక్షితంగా ఉండాలని, ఒకే కుటుంబంగా సామరస్య పూర్వకంగా కలసి జీవించాలని పేర్కొన్నారు. ఈ లక్ష్యసాధనకే ప్రజలను, చేతివృత్తిదారులను చైతన్యం చేసేందుకు భారత పరిక్రమ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న భారత పరిక్రమ పాదయాత్ర బుధవారం జిల్లాలో ప్రవేశించింది.
రాముడి నుంచి కలాం వరకూ అదే చెప్పారు..
ఈ సందర్భంగా తుని మండలం డి.పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఆలయ ప్రాంగణంలో వేర్వేరుగా విద్యార్ధులు, ప్రజలతో సీతారాంజీ సమావేశమయ్యారు. గ్రామ వికాసంతోనే దేశ వికాసం సాధ్యమవుతుందన్నారు. ఇందుకు మనస్సులో శ్రద్ధ కలగాలని స్వామి వివేకానంద ఉద్బోధించారని, ప్రతి వ్యక్తీ తన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మా గాంధీ అన్నారని చెప్పారు. త్రేతాయుగం నుంచి కలియుగం వరకూ; రాముడి నుంచి అబ్దుల్ కలాం వరకూ గ్రామాన్ని రక్షించాలని ఆకాంక్షించారన్నారు. ‘గ్రామాలను దర్శిద్దాం, గోవులను సంరక్షిద్దాం, ప్రకృతిని కాపాడుదాం’ అని ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలో మొక్కలను నాటారు. చేతివృత్తిదారుల ఇళ్లను సందర్శించి వారి స్థితిగతులను అడిగితెలుసుకున్నారు. కాగా సీతారాంజీ రాత్రికి గ్రామంలోనే బస చేసి గురువారం చామవరంలో సందేశం కార్యక్రమం నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.
సాదర స్వాగతం
పాదయాత్రగా వచ్చిన సీతారాంజీకి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండారెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి చోడ్రాజు సత్య కృష్ణంరాజు, ఓలేటి సత్యనారాయణ, ఎం.వి.కుమార్, డాక్టర్ పలకా సోమేశ్వరరావు, చదరం నరసింహమూర్తి, వాడబోయిన సాంబయ్య స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
Advertisement