
వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్న కటక్‌నాథ్ కోళ్ళు
- అత్యంత విలువైన జాతి కోడి
- పెరటి కోళ్ళతో సమానం
- నాటుకోడికి తీసిపోదు..
- ప్రాచుర్యం పొందుతోంది..
- మాంసంలో పోషక విలువలు అధికం
పెరటి కోళ్ల పెంపకం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రధానంగా మారుతోంది. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఈ కోళ్ల పెంపకం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం నాటుకోడి మాంసానికి అధిక డిమాండ్ ఉంది. ఈ నాటుకోడికి ప్రత్యామ్నాయంగా కటక్‌నాథ్ కోడి అందుబాటులోకి వచ్చింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పెంచే ఈ జాతి కోళ్లకు జిల్లా వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎన్నో పోషక విలువలుండి..వేసవిలో సుమారు వంద గుడ్ల వరకు పెట్టే ఈ జాతి కోడితో ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
వైరా:
వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెరటికోళ్ల పెంపకం అత్యంత లాభదాయకంగా తయారవుతోంది. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులతో పాటు భూమిలేని వ్యవసాయ కూలీలు పెరటి కోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాలు గడిస్తున్నారు. సమతుల్యమైన ఆహారంతో పాటు ఆదాయం పొందుతున్నారు. గుడ్లు, మాంసం అమ్మకాలతో మంచి రాబడిని పొందవచ్చని వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సౌమ్యప్రణీత పేర్కొన్నారు.
అత్యంత పోషక విలువలు, రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ జాతి కోళ్లలో కటక్‌నాథ్ ఒకటి. ఈ కోడి అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లోని గిరిజనుల ఇళ్లలో దీన్ని పెంచుతారు. అంతరించి పోతున్న నాటు కోడికి ప్రత్యామ్నాయంగా ఈ కోళ్ళను పెంచవచ్చని, జిల్లా వాతావరణం ఈ కోళ్ల పెంపకానికి అనువుగా ఉంటుంది.
కటక్‌నాథ్ కోడి మాంసం, గుడ్లకు మంచి డిమాండ్ ఉంది. ముదురు నీలం రంగుతో ఉండే ఈకలు, చర్మం, మాంసంతో పాటు ఈ కోళ్ళ రక్తం నలుపు రంగులో ఉంటుంది. అత్యంత అరుదైన సూక్ష్మ పోషకాలు రక్తంలోనూ, మాంసంలోనూ ఉన్నాయి. మెలనిన్ అనే పదార్థం ఈ జాతి కోళ్ళలో అధికంగా ఉంటుంది. ఈ మాంసం తినడం వల్ల మహిళలు అధిక రక్తస్రవం, గర్భస్రవం, ప్రసవానంతర సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ కోడి మాంసంలో బీ1, బీ2, బీ6, బీ12తో పాటు సీ, ఈ విటమిన్లు అధికంగా ఉంటాయి. పాస్ఫరస్, ఇనుము వంటి ధాతువులు మానవ శరీరానికి ఎంతో అవసరమైనవి. 8 అమైనో ఆమ్లాలతో పాటు, 18 అమైనో ఆమ్లాలు వీటి మాంసంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఈ కోడి మాంసంలో ఇనుప ధాతువు బీ2 అధికంగా ఉండటం వలన నిమ్మోనియా, ఎనిమియా, క్షయ, ఆస్తమా వ్యాధుల నివారణకు కటక్‌నాథ్ కోడి మాంసం మంచి ఆహారంగా పనిచేస్తుంది. కీళ్లు, ఎముకల సమస్యలకూ ఔషధంగానూ ఉపయోగపడుతుంది. సాధారణ కోడి మాంసంతో పోలిస్తే ఈ జాతి కోడి మాంసంలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. కొవ్వు శాతం తక్కువ. శరీరానికి అవసరమైన ఓమోగా ఆమ్లాల ఫాటో యాసిడ్ ప్రతిరూపమైన లినోతెనిక్ యాసిడ్ ఈ కోడి మాంసంలో ఉండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ జాతి కోళ్ళలో పొదుగుడు లక్షణం తక్కువ, ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్లు పెడుతుంది. ప్రస్తుతం ఈ కోళ్ళు కృషి విజ్ఞాన కేంద్రం ప్రదర్శన క్షేత్రంలో అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని సత్తుపల్లి ప్రాంతంలో వీటి పెంపకం కూడా ప్రారంభమైంది.