వాస్తు, జ్యోతిషాలు మూఢనమ్మకాలు కావు
– వీటికి కులమతాలు లేవు, అందరికీ ఉపయోగపడతాయి.
– రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన జ్యోతిష, వాస్తు నిపుణులు
రాజమహేంద్రవరం కల్చరల్ : వేదాంగమైన జ్యోతిషం, వాస్తు మూఢనమ్మకాలు కావని శ్రీచక్రవాహినీ సహిత శ్రీమహాలక్ష్మీసమేత చిన్న వేంకన్నబాబు స్వామివారి పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు పేర్కొన్నారు. విజయవాడకు చెందిన భారతీయ జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పీఠంలో జరిగిన రాష్ట్రస్థాయి వాస్తు–జ్యోతిష అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కులమతాలకతీతంగా అందరికీ ఉపయోగపడేవి వాస్తు జ్యోతిషాలని, ఈ సదస్సులో ఎవరి అభిప్రాయాలను తిరస్కరించబోమని, అన్నింటి మధ్య సమన్వయం సాధించే దిశలో ఇది ఒక చిరుప్రయత్నమని అన్నారు. విజయవాడ నుంచి వచ్చిన ‘త్రికాలజ్ఞాన విభూషణ’ పుచ్చా శ్రీనివాసరావు మాట్లాడుతూ గృహనిర్మాణ వాస్తు ధర్మాలను దేవాలయాలకు ముడిపెట్టి, తిరుమల కొండపై వాస్తు బాగుంది, శ్రీకాళహస్తి ఆలయం వాస్తులోదోషాలు ఉండడం వల్ల ఆదాయం అంతగా లేదనే వ్యాఖ్యలను చేయరాదన్నారు.
యుగధర్మాన్ని అనుసరించి ఒక్కో సమయంలో ఒక్కో ఆలయం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుందని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడేనికి చెందిన ‘వాస్తు విజ్ఞాన భాస్కర’ పళ్ళావఝుల శ్రీరామకృష్ణ శర్మ మాట్లాడుతూ వాస్తు గురించిన అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయన్నారు. భోజుడు రచించిన సమరాంగణ సూత్రగ్రంథాన్ని అనుసరించి పడమర దిక్కున బావులు ఉండడం దోషం కాదని, మానసార మహర్షి రచించిన మానసారము గ్రంథాన్ని అనుసరించి ఈశాన్యంలో మెట్లు ఉండవచ్చని అన్నారు. ఈ సందర్భంగా మాయాబజారు సినిమాలో ‘శాస్త్రం సొంత తెలివి లేనివారికి’ అని రమణారెడ్డి శిష్యులు వ్యాఖ్యానించడాన్ని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. జ్యోతిష విశారద పాలపర్తి శ్రీకాంతశర్మ జ్యోతిషం–ప్రత్యక్ష పరిశీలన అనే విషయంపై ప్రసంగించారు. వక్తలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయా అంశాలను వివరించారు. అనంతరం జ్యోతిషరంగానికి పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయనకు ‘జ్యోతిష నిధి’ బిరుదాన్ని అందజేశారు. పొడగట్ల పల్లి గ్రామానికి చెందిన పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్య శర్మను వ్యాసపురస్కారంతో సత్కరించారు. సర్వేజనాసుఖినోభవంతు చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ ధరణికోట వెంకట హైమావతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జ్యోతిష, వాస్తు పండితులు హాజరయ్యారు.