వెలగపూడి ‘గూడు’పుఠాణి!
♦ హడావుడిగా కట్టి.. రహస్యంగా కూల్చేశారు
♦ ఇరుకు గదులు, వాస్తుపై మంత్రుల ఫిర్యాదులు
♦ కట్టిన గదులు రహస్యంగా కూల్చివేత
♦ భారీ సెక్యూరిటీ.. గేట్లకు తాళాలు...
♦ అసలే ‘తాత్కాలికం..’ దానికేబోలెడు వ్యయం
♦ మార్పులతో మరింత వృథా ఖర్చు..
♦ తాత్కాలిక సచివాలయం నుంచి పాలన ఇప్పట్లో లేనట్లే...
సాక్షి, అమరావతి: అది అసలే తాత్కాలిక సచివాలయం... దానికే రూ.700 కోట్ల ఖర్చు. అది కూడా హడావుడిగా నిర్మాణం.. అంతా లోపాల మయం. దాంతో అది ఎవరికీ పనికిరాకుండా పోయింది. గదులు ఇరుకుగా ఉన్నాయని, వాస్తుదోషాలున్నాయని మంత్రులు చేస్తున్న ఫిర్యాదులతో ముఖ్యమంత్రి తలబొప్పికట్టింది. అందుకే భారీ మార్పులకు తెరతీశారు. సచివాలయంలోని 2, 3, 4, 5 భవనాల్లో మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కేటాయించిన గదులను కూలదోస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం కోసం లోనికి ఎవరినీ రానివ్వకుండా బయట తాళాలువేశారు. భారీ సెక్యూరిటీ ఏర్పాటుచేశారు. ఈ మార్పులు చేర్పులకు కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కానున్నది. తాత్కాలిక సచివాలయం కోసం ఇన్ని మార్పులు చేయడం, ఇంత పెద్ద ఎత్తున వృథా చేయడం చూసి అధికారులు విస్తుపోతున్నారు.
మంత్రుల అసహనం.. ఫిర్యాదులు..
తమకు కేటాయించిన గదులు ఇరుకుగా ఉన్నాయని మంత్రి నారాయణ వద్ద యనమల అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల తరువాత సచివాలయాన్ని సందర్శించిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన గదులలో మార్పులు చేయాల్సిందిగా మంత్రి నారాయణకు ఫోన్‌లో సూచించినట్లు తెలిసింది. మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిమిడి మృణాళిని, అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబు, పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు కూడా తమ పేషీలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సీఎం ఆదేశాలతో భారీ మార్పులు
హడావుడిగా చేపట్టిన నిర్మాణాల్లో లోటుపాట్లు ఉన్నాయని మంత్రులు, అధికారులు అసంతృప్తి వ్యక్తం చేయటంతో మార్పులు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కృష్ణా పుష్కరాల్లో అంతా బిజీగా ఉంటారు కనుక కూల్చివేసి తిరిగి నిర్మాణాలు చేపట్టేందుకు ఇదే మంచి సమయమని సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం రెండవ భవనంలో మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. అన్ని భవనాలకంటే ముందుగా ప్రారంభించిన ఐదవ భవనంలో పెద్ద ఎత్తున మార్పులకు తెరతీశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఐదవ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిమిడి మృణాళిని, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కేటాయించిన గదులన్నింటినీ పగులగొట్టారు. ప్రతి మంత్రికి 225 అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు ఉండేలా మార్పులు చేపట్టారు. దీంతో రెండు గదులు కలిపి ఒక మంత్రికి కేటాయించేందుకు మధ్యలో ఉన్న గోడను పగులగొడుతున్నారు.
తాత్కాలిక సచివాలయంలో ఎక్కడెక్కడ గోడలు పగులగొట్టాలో ఇంజనీర్లు మార్క్‌చేశారు. ఆ గోడలపై ‘టోటల్ రిమూవ్డ్’ అంటూ పేపర్‌పై రాసి అంటించారు. గోడలు కూల్చిన ప్రాంతంలో డోర్లు, వాష్‌బేషిన్, బాత్ రూంలు ఎక్కడెక్కడ ఉండాలో మార్కర్‌తో రాశారు. ఇంజనీర్లు సూచించిన చోట్ల గోడలను కార్మికులు పగులగొడుతున్నారు. ఇవన్నీ బయటకు తెలియకుండా ఉండేందుకు ఆయా భవనాలకు తాళాలు వేసి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎవరినీ లోనికి పంపొద్దని గట్టిగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
గోడలు కూల్చి తిరిగి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఖర్చుచేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భవనాలకు ఇప్పుడు చేస్తున్న భారీ మార్పులు చూస్తుంటే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ పాలన ఇప్పుడే ప్రారంభమయ్యే అవకాశమే లేదని తేలిపోయింది. ప్రభుత్వ హడావుడి నిర్ణయాలతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు.