‘వెన్నపూస’ విజయకేతనం | vennapusa gopalreddy won in mlc elections | Sakshi
Sakshi News home page

‘వెన్నపూస’ విజయకేతనం

Published Wed, Mar 22 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

‘వెన్నపూస’ విజయకేతనం

‘వెన్నపూస’ విజయకేతనం

– మండలి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి
– టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డిని ఎలిమినేట్‌ చేసి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన అధికారులు
– వెన్నపూసకు ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ కంటే 223 ఓట్ల ఆధిక్యత...టీడీపీ అభ్యర్థిపై 14,367 ఓట్ల మెజార్టీ
–పార్టీ అభ్యర్థి గెలుపుతో కదనోత్సాహంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు
– ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికలే రెఫరెండం అంటున్న పార్టీ నేతలు


(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
అందరూ అనుకున్నట్లే జరిగింది. పట్టభద్రులు ‘ఓటెత్తిన’ చైతన్యంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి పట్టం కట్టారు. తద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెప్పారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కౌంటింగ్‌లో తొలిరౌండ్‌ నుంచి నిలకడైన ఆధిక్యత ప్రదర్శించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి తిరుగులేని విజయం సాధించారు.  పెద్దలసభలో ఆయన సగర్వంగా అడుగుపెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ తమకు బలమైన జిల్లాగా భావిస్తున్న అనంతపురం నుంచి, అందులోనూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో ‘అనంత’తో పాటు కర్నూలు, వైఎస్సార్‌ జిల్లా వాసుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఏస్థాయిలో వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది. ఇదే తరుణంలో వైఎస్సార్‌సీపీపై గట్టి నమ్మకం ఉంచారన్న విషయాన్ని ఈ ఎన్నికలు సుస్పష్టం చేస్తున్నాయి. గోపాల్‌రెడ్డి గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి.

            పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఈ నెల 20న మొదలైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్‌ నుంచి ప్రతి రౌండ్‌లోనూ గోపాల్‌రెడ్డి నిలకడగా ఆధిక్యత ప్రదర్శించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆరు రౌండ్లలో 53,714 ఓట్లు దక్కించుకున్నారు. అప్పటికి తన సమీప ప్రత్యర్థి కేజేరెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యత సాధించారు. అయితే విజయానికి అవసరమయ్యే ‘మ్యాజిక్‌ ఫిగర్‌’  67,887. దీని కంటే 14,173 ఓట్లు తక్కువ రావడంతో ఎన్నికల అధికారులు మంగళవారం ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. బరిలోని 25మంది అభ్యర్థులలో తక్కువ ఓట్లు పోలైన వారి నుంచి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కరిని ఎలిమినేట్‌ చేస్తూ వచ్చారు. వారి ఓట్లను ఇతర అభ్యర్థులకు జత పరుస్తూ వచ్చారు. గోపాల్‌రెడ్డి, కేజేరెడ్డి, గేయానంద్‌ మినహా తక్కిన 23 మంది అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓట్లు 8,239  పోలయ్యాయి.

ఎలిమినేషన్‌లో ఈ ఓట్లలో 23వ రౌండ్‌ ముగిసే సరికి గోపాల్‌రెడ్డికి మరో 1,771 లభించాయి. ఆపై 23వ రౌండ్‌లో గేయానంద్‌ను ఎలిమినేట్‌ చేశారు.  ఆయనకు లభించిన మొత్తం 34,910 (22వ రౌండ్‌ పూర్తయ్యే సరికి) ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యతను లెక్కించారు. ఇందులో 10,798 ఓట్లు గోపాల్‌రెడ్డికి దక్కాయి. ఇవి కలిపి గోపాల్‌రెడ్డికి వచ్చిన ఓట్ల సంఖ్య  66,283కు చేరింది. అయినప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌కు 1,827 ఓట్ల దూరంలో నిలిచారు. దీంతో చివరకు టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డిని ఎలిమినేట్‌ చేసి ఆయనకు పోలైన ద్వితీయ ప్రాధాన్యత, ఆ తర్వాత ప్రాధాన్యత ఓట్లను 24వ రౌండ్‌గా అధికారులు లెక్కించారు. ఈ ప్రక్రియలో ఒక్కో టేబుల్‌ పరిధిలోని ఓట్లు లెక్కిస్తూ మ్యాజిక్‌ ఫిగర్‌కు గోపాల్‌రెడ్డి చేరువయ్యారా, లేదా అని అధికారులు పరిశీలిస్తూ వచ్చారు. కొన్ని టేబుళ్లలోని ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక గోపాల్‌రెడ్డికి పోలైన ఓట్లను పరిశీలించగా 68,110కి చేరాయి. ఆయన విజయానికి అవసరమైన ఓట్లు 67,887 మాత్రమే. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే 223 ఓట్లు ఎక్కువ లభించడంతో ఎన్నికల అధికారులు గోపాల్‌రెడ్డి విజయాన్ని ఖరారు చేశారు.

జిల్లా వ్యాప్తంగా సంబరాలు
     గోపాల్‌రెడ్డి గెలిచినట్లు బుధవారం ఉదయం ఆరు గంటలకు అధికారులు ప్రకటించారు. ప్రకటన వెలువడగానే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాప్తాడు సమన్వయకర్త  తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, వైఎస్సార్‌సీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ వెన్నపూస రవీంద్రారెడ్డితో పాటు పలువురు నేతలు కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకుని గోపాల్‌రెడ్డిని అభినందించారు. ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకున్నారు. ఆపై రిటర్నింగ్‌ అధికారి కోన శశిధర్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని అందజేశారు. తర్వాత పార్టీ నేతలంతా ఆనందోత్సాహాల మధ్య గోపాల్‌రెడ్డిని భుజాలపై ఎత్తుకుని ర్యాలీగా బయటకు వచ్చారు. అప్పటికే పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద  పార్టీ కార్యకర్తలు భారీగా వేచివున్నారు. గోపాల్‌రెడ్డి బయటకు రాగానే పూలమాలలు వేసి అభినందించారు. ‘జై జగన్‌’.. ‘జోహార్‌ వైఎస్సార్‌’ నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుంచి ర్యాలీగా వైఎస్సార్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఆపై పార్టీ కార్యాలయానికి వెళ్లి సంబరాలు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.

టీడీపీకి కోలుకోలేని దెబ్బ
            గోపాల్‌రెడ్డి అనంతపురం జిల్లా వాసి. జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో 2 ఎంపీలతో పాటు 12 ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ గెలిచింది. కదిరి ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషాను ప్రలోభపెట్టి సైకిలెక్కించారు. కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన 8మంది ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పారు. ఈ క్రమంలో మెజార్టీ ఎమ్మెల్యేలు, అధికార అండతో మండలి ఎన్నికల్లో గెలవాలని టీడీపీ భావించింది. అయితే.. విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్ష పార్టీ పనితీరును బేరీజు వేస్తూ తీర్పు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి పట్టం కట్టారు. టీడీపీ అభ్యర్థి ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి. నెలకిందట సీఎం చంద్రబాబు పిలిచి జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని హెచ్చరించారు. ఈ మాటలను నిజం చేసేలా ఓటర్లూ తీర్పు ఇచ్చారు. ఈ విజయంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి. వచ్చే ఏడాది జరగబోయే సర్పంచ్‌ ఎన్నికలతో పాటు ఆపై  జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement