సొంతంగా ఎదుగుదాం
అస్తిత్వాన్ని నిలబెట్టుకుందాం
వికాస్ పర్వ్’లో మనోగతాన్ని వెల్లడించిన కమలనాథులు
ముగిసిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
ఏలూరు : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా మిగిలిపోకుండా.. సొంత కాళ్లపై ఎలా నిలబడాలనే విషయంపై బీజేపీలో చర్చ జరిగింది. భీమవరంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శనివారం రాత్రి ముగిశాయి. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై ‘వికాస్ పర్వ్’ పేరిట కమలనాథులు మేధోమథనం సాగించారు.
ఇప్పటికిప్పుడే టీడీపీతో తెగతెంపులు చేసుకునే పరిస్థితి లేనందున.. ఆ పార్టీతో మిత్రత్వాన్ని కొనసాగిస్తూనే పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేలా ముందుకు వెళ్లాలని ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు. సమావేశాల్లో పాల్గొన్న వక్తలంతా ప్రధాని నరేంద్రమోదీని, ఆయన పాలనా తీరును పొగడటానికే ఎక్కువ సమయం కేటాయించారు.
‘నిధులు, పథకాలు మనవి.. లబ్ధి వారికా’
రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా నిధులు ఇస్తోందని, అయితే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంపై సమావేశాల్లో సుదీర్ఘ చర్చ సాగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పెద్దఎత్తున ఇస్తున్న నిధులు తదితర అంశాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని నాయకులు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పిం చారు.
రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం వంటి వాటిని త్వరితగతిన పూర్తిచేసే లక్ష్యంతో కేంద్రం ముందడుగు వేస్తోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు నిధులిస్తున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించాలని హితబోధ చేశారు.
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్ట్‌ల కోసం ఇప్పటికే రూ.1.43 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్న విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని, అసంఘటిత రంగ కార్మికులకు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన బీమా పథకాన్ని టీడీపీ సర్కారు చంద్రన్న బీమా పేరుతో అమలుచేస్తున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
మరోవైపు రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలనే అంశంపైనా చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి మంచి పట్టు ఉన్నందున పొత్తులేకుండా ఒంటరిగా పోటీ చేయాలని పలువురు వాదించారు. ఇప్పుడే ఒంట రిగా పోటీ చేయడం సరికాదని, మిత్రపక్షంతో కలిసిపోటీ చేద్దామని ముఖ్య నేతలు సూచించారు.
మొత్తానికి రెండు రోజులపాటు జరిగిన సమావేశాలు కీలకమైన నిర్ణయాలు తీసుకోకుండానే ముగిశాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎలాంటి ప్రకటన చేయకుండా వాయిదా వేశారు. అదే సమయంలో పార్టీలో అంతర్గత క్రమశిక్షణ లోపించిన విషయంపైనా చర్చ జరిగింది. సదావర్తి భూముల కుంభకోణంలో సొంత పార్టీవారే విజయవాడలో ధర్నా చేయడం పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించిందన్న భావన నేతల్లో వ్యక్తమైంది.