అమ్మో...అయ్యో..!
అమ్మో...అయ్యో..!
Published Thu, Jul 21 2016 5:36 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
జిల్లాలో అధికారులు ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. మలేరియా, డెంగీ జ్వరాలు సవాల్ విసురుతున్నా అధికారగణం చేష్టలుడిగి చూస్తోంది. ఫలితంగా జిల్లాలో జ్వరాల దెబ్బకు ప్రజలు అల్లాడుతున్నారు. పుష్కర పనులపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపకపోవడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విజయవాడ (లబ్బీపేట) :
విజయవాడ నగరంతో పాటు జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అధిక శాతం మంది జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. జ్వరం కుటుంబంలో ఒకరికి వస్తే, మిగిలిన సభ్యులకు కూడా సోకడంతో ఇంటిలోని వారంతా బాధపడుతున్నారు. విజయవాడ పటమట, సింగనగర్, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు అధికంగా నమోదవుతున్నట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు.
జ్వరాలు రెండు రోజులు ఉండి తగ్గిపోతాయని, ప్రమాదకరం కాదని వైద్యులు చెపుతున్నా, బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మలేరియాతోపాటు, డెంగీ పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నట్లు చెపుతున్నారు.
జక్కంపూడి, కైకలూరుల్లో విజృంభించిన జ్వరాలు ....
నగరంలోని జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీ, జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో వారం రోజులుగా జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. వందలాది మంది జ్వరంతో బాధపడుతున్నారు. జక్కంపూడిలో మలేరియా శాఖ ప్రత్యేక శిబిరం నిర్వహించగా, కైకలూరులో బుధవారం ప్రత్యేక క్యాంపు నిర్వహించి వందమందికిపైగా పరీక్షలు చేసినట్లు చెపుతున్నారు. పరిసరాల్లో మురుగు నీరు కారణంగా దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు సోకుతున్నట్లు చెపుతున్నారు.
ప్రభుత్వాస్పత్రిలో పెరుగుతున్న ఓపీ ...
విజయవాడ ప్రభుత్వాస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగానికి సాధారణ రోజుల్లో 80 నుంచి 100 మంది వరకు రోగులు వస్తుంటారు. ప్రస్తుతం జ్వరాల కారణంగా 150 మందికిపైగా వస్తున్నట్లు చెపుతున్నారు. పిల్లల విభాగానికి నిత్యం 60 నుంచి 80 మంది వరకు వస్తుంటారని, ప్రస్తుతం వంద మందికిపైగా వస్తున్నట్లు చెపుతున్నారు. పిల్లల్లో ఎక్కువ మంది వైరల్ జ్వరాల కారణంగా వస్తున్నట్టు చెపుతున్నారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులకు సైతం పెద్ద సంఖ్యలో జ్వరబాధితులు వైద్యపరీక్షల కోసం క్యూ కడుతున్నారు.
కార్పొరేట్‌కు వెళితే జేబులు ఖాళీ ...
జ్వరాలతో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళితే వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. వైరల్ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ బాలుడికి రూ.1.50 లక్షలు వైద్య ఖర్చులు అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇదిలావుంటే, జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నా నివారణ చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైనట్లు తెలుస్తోంది. పుష్కర పనులపైనే అధికారులు దృష్టిసారించి జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాం ...
జిల్లాలో జ్వరాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాం. జక్కంపూడిలో మూడు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించి 40 మంది నుంచి రక్త నమూనాలు సేకరించాం. ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. తిరువూరు కూడా వెళ్లి పరిశీలించాం. కైకలూరులో ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నాం. ఇళ్ల చుట్టూ నీరు, పారిశుధ్య సమస్యలు ఉన్న ప్రాంతాల్లో జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి.
- ఆదినారాయణ, కృష్ణా జిల్లా మలేరియా ఆధికారి
Advertisement
Advertisement