జిల్లాలో వైరల్ జ్వరాలు
జంగారెడ్డిగూడెం : జిల్లాలో వైరల్ జ్వరాలు అధికంగా ఉన్నాయని, జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీహెచ్‌ఎస్ (జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి) డాక్టర్ కె.శంకర్రావు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఏరియా ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి రోగులను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అన్ని ఆసుపత్రులు జ్వరపీడితులతో నిండిపోయాయని పేర్కొన్నారు. వైరల్ ఫీవర్స్‌తో పాటు టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
ఏజెన్సీలో మాత్రం అక్కడక్కడ రోజుకు 5 నుంచి 7 మలేరియా కేసులు నమోదు అవుతున్నట్టు చెప్పారు. మలేరియాకు సంబంధించి అధునాతన మందులు అందుబాటులోకి వచ్చాయని, దీనివల్ల ఇబ్బందులులేవన్నారు. అలాగే జిల్లాలో జ్వరపీడితులందరికీ అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచామని, ఇబ్బందులు లేవన్నారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో ఉన్న మాస్టర్ మహిళా హెల్త్ చెకప్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.భాస్కరరావు, డాక్టర్ డి.వరహాలరాజు, డీసీఎస్ ఓ.దిలీప్‌కుమార్, డాక్టర్ సునీత, డాక్టర్ శోభారాణి పాల్గొన్నారు.